Asafoetida: ఇంగువ మన దేశంలో ఇంతవరకు పండించలేదు, మరెలా మన వంటల్లో భాగమైంది?
భారతదేశంలో పండని పంటల్లో ఇంగువ కూడా ఒకటి.
ప్రసాదం పులిహోర చేసినా, సాంబారు చేసుకున్నా ,చిటికెడు ఇంగువ పొడి పడాల్సిందే. అప్పుడు ఆ రుచే వేరు. ఇంగువ మన వంటకాల్లో ప్రాచీన కాలం నుంచి భాగమై పోయింది, కానీ ఆ పంట మాత్రం మన నేలపై ఇంతవరకు పండలేదు. గత రెండేళ్ల నుంచి ఇంగువ మొక్కలను పెంచేందుకు శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారు. ఇప్పటికే 800 మొక్కల దాకా కాశ్మీర్ దగ్గరున్న స్పితి లోయలో, లాహౌల్ ప్రాంతాల్లో నాటారు. కానీ ఇంగుల మొక్కలు మన వాతావరణాన్ని తట్టుకుని బతకలేకపోతున్నాయి. 100 విత్తనాలు చల్లితే కేవలం రెండు మొక్కలు మొలిచాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎప్పట్నించో మనం ఇంగువను ఇతర దేశాలను దిగుమతి చేసుకుని వాడుతున్నాం.
ఏఏ దేశాలు...
ఆఫ్టనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాల నుంచే మనకు అధికంగా ఇంగువ దిగుమతి అవుతుంది. ఉల్లి, వెల్లుల్లి తినని వారంతా ఇంగువను వాడేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇంగువ మొక్కలు అడవుల్లో అధికంగా పెరుగుతాయి. అది కూడా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గరే ఆ మొక్కలు పెరుగుతాయి. అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్కలు పెరగవు. మన దగ్గర అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఇంగువ మొక్కలు మొలిచినా కూడా జీవించలేకపోతున్నాయి.
ఇలా తయారుచేస్తారు?
ఆంగ్లంలో దీన్ని అసోఫెటిడా అంటారు. లాటిన్ పదం నుంచి పుట్టింది ఇది. దీనికర్ధం జిగురులాంటి పదార్థం అని అర్థం. ఇంగువ మొక్కల వేళ్ల నుంచి జిగురులాంటి పదార్థాన్ని సేకరిస్తారు. ఆ పదార్థానికి బియ్యప్పిండి లేదా గోధుమపిండి కలిపి ఎండ బెడతారు. ముక్కలు ముక్కలు ఎండిన ఆ పదార్థాలను పొడిలా చేసి ఇంగువ పొడిగా అమ్ముతారు. ఇంగువను దేవుళ్ల ఆహారంగా పిలుచుకుంటారు పర్షియన్లు. ప్రాచీన రోమన్లు, గ్రీకులు దీన్ని అధికంగా వాడేవారు. మనదేశానికి ఇంగువ వచ్చి 600 ఏళ్లు గడచిందని చరిత్రకారులు చెబుతారు. మొదటిసారి అఫ్గనిస్తాన్ నుంచే వచ్చిందని అంటుంటారు.అలా ఇంగువ మహత్యాన్ని, అది అందించే రుచి ఆరోగ్యాన్ని మన భారతీయులు అర్థం చేసుకున్నారు. అప్పట్నించి ప్రతి వంటలో చిటికెడు ఇంగువ చల్లుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అలా ఇప్పుడు ఇంగువ అత్యవసరమైన వంటదినుసుగా మారిపోయింది. పప్పు, సాంబారు, పప్పుచారు, పులిహోర, కూరల్లో ఇంగువ వేసుకుంటే రుచి మారిపోతుందని చెబుతారు ఎంతో మంది.
Also read: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి
Also read: ఈ లక్షణాలు కరోనా వైరస్‌వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు