Kids Fever: చంటి పిల్లలకు జ్వరంతో పాటూ ఫిట్స్ వచ్చిందా? వెంటనే ఇలా చేయండి
చంటి పిల్లల విషయంలో ఏదీ అశ్రద్ధ చేయకూడదు. ముఖ్యంగా జ్వరాన్ని.
చంటి పిల్లల భాష ఏడుపు మాత్రమే. తమకు అనారోగ్యంగా ఉండే అది ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే వారిలో చిన్న మార్పు వచ్చినా, పదే పదే ఏడుస్తున్నా, పాలు తాగకపోయినా, మూత్ర విసర్జన చేయకపోయినా అన్నింటినీ జాగ్రత్తగా గమనించి వైద్యుడిని సంప్రదించాలి. జ్వరాన్ని చాలా మంది సాధారణమైన సమస్యగా భావిస్తారు. పెద్దవారిలో జ్వరం సాధారణమైనదే, కానీ చంటి పిల్లలకు జ్వరం వస్తే మాత్రం తేలికగా తీసుకోకూడదు. వారి శరీరం ఆ వేడిని తట్టుకోలేక ఫిట్స్ బారిన పడుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే జ్వరం వచ్చాక వారిని కనిపెట్టుకుని కూర్చోవాలి. వంద రీడింగ్ వరకు పరవాలేదు, వంద ఫారెన్ హీట్ దాటితే మాత్రం వైద్యుని దగ్గరకు తీసుకెళ్లడం చాలా మంచిది. కొందరి పిల్లల్లో 101,102 ఫారెన్ హీట్ జ్వరం ఉన్నప్పుడే ఫిట్స్ వస్తుంటుంది.
ఫిట్స్ ఎందుకు వస్తుంది?
మూర్ఛ లేదా ఫిట్స్... ఇది శరీరంలో ఏదైనా తీవ్ర మార్పు లేదా అసమతుల్యత ఏర్పడినప్పుడు వచ్చే సూచన. సాధారణంగా అయితే జ్వరం తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. ఆరు నెలల నుంచి పిల్లల్లో ఈ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అబ్బాయిల్లోనే అధికంగా కనిపిస్తుంది. కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఇలాంటి మూర్ఛ ఉండడంలో తరువాతి తరాల వారికి వచ్చే అవకాశం ఉంది. రక్తహీనత, సోడియం లోపం వల్ల కూడా కలగవచ్చు.
ఎప్పుడు ప్రమాదకరం?
జ్వరం వచ్చినప్పుడు వచ్చే ఫిట్స్ వైద్యులు వెంటనే తగ్గిపోయేలా చేస్తారు. ఒక పూట ఆసుపత్రిలో ఉంచి పంపించేస్తారు. ఇలా జ్వరంలో వచ్చి పోయే మూర్ఛ గురించి పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని సార్లు మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎప్పుడంటే...
1. ఎదుగుదల సరిగా లేని పిల్లల్లో ఫిల్స్ కనిపించినప్పుడు
2. ఫిట్స్ వచ్చిన తరువాత కాసేపటికి ఆగిపోతుంది. అలా ఆగకుండా ఎక్కువసేపు వచ్చినా...
3. ఒక్కరోజులో ఒకసారి కన్నా ఎక్కువ సార్లు ఫిట్స్ వచ్చినా...
4. పిల్లలు ఆహారం తీసుకోకుండా ఏడుస్తున్నా, వాంతులు చేసుకుంటుంటున్నా...
ఇలాంటి సందర్భాల్లో ఫిట్స్ గురించి పట్టించుకోవాల్సిందే. అది రావడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నేయేమో తెలుసుకోవాలి. ఎందుకంటే మూర్ఛ శరీరంలో దాక్కున్న కొన్ని అనారోగ్యాలకు లక్షణంగా కూడా కనిపిస్తుంది.
జ్వరంలో ఫిట్స్ వస్తే ఏం చేయాలి?
1. జ్వరం తగ్గితే ఫిట్స్ లక్షణాలు పోతాయి. కాబట్టి టెంపరేచర్ పెరగకుండా చూసుకోవాలి.
2. ప్రతి పావుగంటకోసారి శరీర ఉష్ణోగ్రత చల్లబడేలా తడిగుడ్డతో తుడవాలి.
3. శరీరంలో నీరు తగ్గకుండా చూసుకోవాలి. నీళ్లు, ఓఆర్ఎస్ వంటివి పట్టించాలి.
Also read: ఈ లక్షణాలు కరోనా వైరస్‌వే, చాలా మందికి వీటిపై అవగాహన లేదు