Naren Rama: టాలీవుడ్‌లోకి మరో వారసుడు - రచ్చ గెలిచి ఇంటికి వస్తున్న గుమ్మడి మనవడు
Kaliyugam Pattanamlo movie actor Naren Rama interview: తెలుగులోకి మరో వారసుడు వస్తున్నాడు. 'కలియుగం పట్టణంలో' సినిమాతో సీనియర్ నటుడు గుమ్మడికి మనవడు అయ్యే నరేన్ రామ నటుడిగా పరిచయం అవుతున్నారు.
చిత్రసీమలోకి వచ్చే కొత్తగా వచ్చే నటీనటుల కంటే వారసులు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. వాళ్లపై అంచనాలు ఉంటాయి. విమర్శలూ స్థాయిలో వస్తాయి. తెలుగు పరిశ్రమలోకి వచ్చిన స్టార్ కిడ్స్ తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో వారసుడు వస్తున్నారు. 'కలియుగం పట్టణంలో' (Kaliyugam Pattanamlo Movie) సినిమాతో తెలుగు చిత్రసీమకు సీనియర్ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు వరుసకు మనవడు అయ్యే నరేన్ రామ (Naren Rama) నటుడిగా పరిచయం అవుతున్నారు. రచ్చ గెలిచి ఇంటికి వచ్చినట్లు... తమిళంలో హీరోగా మూడు, విలన్‌గా ఒక సినిమా చేసి, తెలుగు తెరకు వచ్చారు. మార్చి 29న 'కలియుగం పట్టణంలో' విడుదల కానున్న సందర్భంగా టాలీవుడ్ మీడియాతో నరేన్ రామ ముచ్చటించారు. ఆ విశేషాలు...
తల్లిదండ్రులు చెన్నైలో సెటిల్ కావడంతో...
Actor Naren Rama Interview: ''నాకు గుమ్మడి గారు తాతయ్య వరుస. నా బాల్యం నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాయా. దాంతో మొదట్నుంచి సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. మేం తెలుగు వారిమే. నా తల్లిదండ్రులు చెన్నైలో స్థిరపడ్డారు. అందువల్ల, ముందు తమిళంలో అవకాశాల కోసం ప్రయత్నించా. కొన్ని యాడ్స్, సినిమాలు చేశా. 'కలియుగం పట్టణంలో' సినిమాతో తెలుగుకు పరిచయం అవుతున్నా. ఈ సినిమాలో కీలక పాత్ర చేశా'' అని చెప్పారు నరేన్ రామ.
Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో 'కలియుగం పట్టణంలో' చిత్రాన్ని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందీ నరేన్ రామ వివరిస్తూ... ''నేను అవకాశాల కోసం చూస్తున్నప్పుడు... కో డైరెక్టర్, నా వెల్విషర్ సాయి అన్న పిలిచారు. రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి కీలకమైన రోల్ ఆఫర్ చేశారు. కథ, క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చేశా. దర్శకుడు తనకు కావలసినట్టు చేయిచుకున్నారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది'' అని చెప్పారు.
థియేటర్లలో చూడాల్సిన థ్రిల్లర్ చిత్రమిది
సినిమాతో పాటు హీరో హీరోయిన్ల గురించి నరేన్ రామ మాట్లాడుతూ... ''ఆల్రెడీ విశ్వ కార్తికేయ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేశాడు. హీరోగానూ కొన్ని సినిమాలు చేశారు. నటుడిగా నా కంటే సీనియర్. చిత్రీకరణలో నాకు ఎంతో హెల్ప్ చేశారు. మేం డిస్కస్ చేసుకుని సీన్స్ చేశాం. ఇదొక మంచి థ్రిల్లర్. థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అజయ్ మంచి సంగీతం ఇచ్చారు. టైటిల్ సాంగ్, అమ్మ సాంగ్ నాకు బాగా నచ్చాయి. షూటింగ్ కోసం కడపకు వెళ్ళా. అక్కడికి వెళ్ళడం అదే తొలిసారి. సినిమాల్లో కడప అంటే ఫ్యాక్షన్ అన్నట్టు చూపించారు కానీ అక్కడి ప్రజలు చాలా ప్రశాంతంగా ఉంటారు. మాకు ఎంతో మద్దతు ఇచ్చారు'' అని చెప్పారు.
ప్రస్తుతం నరేన్ రామ కొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారు. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు 'WHO' సినిమాతో రాబోతున్నారు.
Also Read: పృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?