Guntur Car Accident: గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం... కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఓ విద్యార్థి మృతి, ఏడుగురికి గాయాలు
గుంటూరు జిల్లా బాపట్లలో కారు ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు కాలువలోకి దూసుకెళ్లింది. మత్స్యకారులు సకాలంతో స్పందించిన కారులోని వారిని రక్షించారు.
గుంటూరు జిల్లా బాపట్లలో కారు ప్రమాదం జరిగింది. కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందారు. మరో ఏడుగురు గాయాల పాలయ్యారు. విజయవాడ సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన ఎనిమిది మంది విద్యార్థులు కారులో శనివారం సూర్యలంక సముద్ర స్నానానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో బాపట్ల ఆదర్శనగర్ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది.
కాలువలోకి దూసుకెళ్లిన కారు
ఈ ప్రమాదంలో కారు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన మత్స్యకారులు కారు అద్దాలు పగలగొట్టి వారందర్నీ రక్షించారు. ఈ ఘటనలో ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన శ్రీనిధిరెడ్డి మృతిచెందారు. గాయపడిన మరో ఏడుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిహారిక, సాయి తులసి అనే ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలవ్వడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మత్స్యకారులు సకాలంలో స్పందించడంతో ఘోర ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.
అనంతపురంలో రోడ్డు ప్రమాదం
అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో సత్యసాయిబాబా కళాశాల వద్ద ఎదురుగా వచ్చిన రెండు ఆటోలు ఢీకొన్నాయి. దీంతో సమీపంలో ఉన్న ఇన్నోవా వాహనం పైకి ఆటోలు దూసుకెళ్లాయి. ఆటోలలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక ఆటోలో ఇద్దరూ, మరో ఆటోలో డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ఆటో డ్రైవర్ తీవ్రగాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో వ్యక్తి కందుకూరుకి చెందిన శ్రీనివాసులు మృతి చెందారు. ఆటోలు వేగంగా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: B.Tech Fee Hike: తెలంగాణలో భారీగా పెరిగిన బీటెక్ ఫీజులు.. రెగ్యులర్ కోర్సులకు రెండింతలైన రుసుము