B.Tech Fee Hike: తెలంగాణలో భారీగా పెరిగిన బీటెక్ ఫీజులు.. రెగ్యులర్ కోర్సులకు రెండింతలైన రుసుము
తెలంగాణలో ప్రభుత్వ బీటెక్ రుసుములు భారీగా పెరిగాయి. బీటెక్, బీఫార్మసీ కోర్సుల రుసుములను పెంచుతున్నట్లు కనీసం ఎలాంటి ప్రకటనా లేకుండానే వర్సిటీలు ఫీజులను పెంచాయి.
తెలంగాణలో ప్రభుత్వ బీటెక్ రుసుములు భారీగా పెరిగాయి. బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులకు జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా యూనివర్సిటీలు షాక్ ఇచ్చాయి. రెగ్యులర్ కోర్సులతో పాటు సెల్ఫ్ పైనాన్స్ కోర్సుల ఫీజులను ఏకంగా రెండింతలు పెంచాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో ఇంజనీరింగ్ చదవడం భారం కానుంది. కొత్తగా పెరిగిన ఫీజులు.. జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌తో పాటు మంథని, జగిత్యాల, సుల్తానాపూర్, ఈ ఏడాది కొత్తగా ప్రారంభం కానున్న సిరిసిల్ల కాలేజీల్లోనూ అమలు కానున్నాయి. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీకి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. కాకతీయ, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు మాత్రం ఫీజులను పెంచలేదు. ఎలాంటి అధికారిక ప్రకటనా లేకుండానే వర్సిటీలు ఫీజులు పెంచడం గమనార్హం. ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఆయా కాలేజీల జాబితా, కోర్సులు, ఫీజులు వంటి పలు వివరాలను సాంకేతిక విద్యా శాఖ పొందుపరిచింది. దీంతో పెరిగిన ఫీజుల విషయం వెలుగులోకి వచ్చింది.
రెగ్యులర్ కోర్సులకు రెండింతలు..
బీటెక్ రెగ్యులర్ ఫీజును రూ.18 వేల నుంచి రూ.35 వేలకు పెంచారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజు రూ.35 వేల నుంచి రూ.70 వేల వరకు పెరిగింది. ఇక ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో 2021-22 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సుకు ఏకంగా రూ.1.20 లక్షలు రుసుంగా నిర్ణయించారు. వృత్తి విద్యా కోర్సులతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 128 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని చోట్లా సెల్ఫ్ ఫైనాన్స్ పీజీ కోర్సులే ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చేరే వారికీ ఈసారి ఫీజుల భారం పడనుంది.
2019 నుంచి ఇప్పటికి ఇంతనా?
2019లో యూనివర్సిటీల్లోని రెగ్యులర్ బీటెక్ ఫీజును రూ.10 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. ఇక ఇప్పుడు ఈ ఫీజును ఏకంగా రూ.35 వేలకు పెంచారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ఫీజులైతే ఏకంగా రూ.70 వేలకు పెరిగాయి. ఈ కోర్సుల్లో బోధించే కాంట్రాక్టు, తాత్కాలిక లెక్చరర్ల జీతాలను నిర్దేశించడంలో భాగంగా ఫీజులను పెంచుకోవచ్చని జూలై నెలలో విద్యా శాఖ అనుమతి ఇచ్చింది. కనీస ఫీజును రూ.45 వేలుగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా వర్సిటీలు పాలకమండలి సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విద్యా శాఖ బీటెక్ కనీస ఫీజు రూ.45 వేలు ఉండాలని చెప్పగా.. వాటిని జేఎన్‌టీయూహెచ్ ఏకంగా రూ.70 వేలకు పెంచింది.
చుక్కలు చూపెడుతున్న ఏఐ కోర్సు ఫీజు..
2021-22 విద్యా సంవత్సరం నుంచి ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలో సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఏఐ, మైనింగ్ ఇంజనీరింగ్ అనే 2 కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. వీటిలో సీఎస్‌ఈ ఏఐ అండ్ ఎంఎల్ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లాంగ్వేజ్) కోర్సు ఫీజు ఏకంగా రూ.1.20 లక్షలుగా నిర్ణయించారు. ఇక మైనింగ్ ఇంజినీరింగ్ ఫీజు రూ.లక్షగా ఉంది.