Telangana Local Elections: కోర్టు కేసులు తేలక ముందే నామినేషన్లు - తెలంగాణ స్థానిక ఎన్నికలు చెల్లుతాయా ?
Telangana: కోర్టు కేసులు వ్యతిరేకంగా వస్తే తెలంగాణ స్థానిక ఎన్నికలు చెల్లవు. అందుకే కోర్టు కేసులు తేలకుండా జరిగే ఎన్నికలపై రాజకీయ పార్టీలు సందిగ్ధంలో ఉన్నాయి.

Will Telangana local elections be valid : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ గురువారం జారీ కానుంది. ఉదయం పదిన్నర గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం హైకోర్టులో రిజర్వేషన్ల జీవోపై విచారణ కొనసాగుతుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరవాత కోర్టులు జోక్యం చేసుకోవు. అందుకే ప్రక్రియ ఎన్నికల వరకూ జరుగుతుందని నమ్ముతున్నారు. కానీ న్యాయపరిశీలనలో రిజర్వేషన్ల జీవో నిలబడలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఎన్నికల ప్రక్రియ కూడా చెల్లకుండా పోతుంది. ఎందుకంటే ఆ రిజర్వేషన్ల జీవో ఆధారంగానే ఎన్నికల జీవో ఇచ్చారు. ఆ జీవో చెల్లనప్పుడు ఎన్నికల ప్రక్రియ కూడా చెల్లదు. అందుకే రాజకీయ పార్టీలు ఇప్పటికీ స్థానిక ఎన్నికల ప్రక్రియను నమ్మలేకపోతున్నాయి.
తొలి రోజే కాంగ్రెస్ నామినేషన్లు - ఇతర పార్టీల్లో లేని నమ్మకం
నామినేషన్ల గడువు ప్రారంభమైన వెంటనే .. తమ పార్టీ నేతలతో నామినేషన్లు వేయించాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇది ఓ రకంగా రాజకీయంగా ఒత్తిడి పెంచే వ్యూహమే. రిజర్వేషన్ల జీవోపై స్టే ఇస్తే.. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదని వాదించే ఓ ఆప్షన్ అధికార కాంగ్రెస్ పార్టీ వద్ద ఉంటుంది. కానీ కాంగ్రెస్ నేతలకూ ఈ ఎన్నికల చెల్లుబాటుపై సందేహాలు ఉన్నాయి. నామినేషన్లు వేసి ఖర్చులు పెట్టుకున్న తర్వాత అవి చెల్లకుండా పోతే నష్టపోతారు. ఇతర పార్టీలు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్న పరిస్థితులు కనిపించడం లేదు.
చట్టపరంగా కేసులు ఉంటే ముందుకెళ్లడం మంచిదేనా?
రిజర్వేషన్ల జీవో ఇవ్వడానికి ప్రాతిపదిక అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు. ఆ బిల్లులను గవర్నర్ అధికారింగా ఆమోదించలేదు. అలాంటప్పుడు జీవో ఎలా ఇవ్వగలన్న ప్రశ్న వస్తోంది. గతంలో ఇలాంటి జీవోలు వచ్చినప్పుడు న్యాయపరిశీలనలో నిలబడలేదు. ఆ జీవో బేస్ గా చేసుకుని నిర్వహించిన ఎన్నికలు కూడా చెల్లలేదు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇదే విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని..ఈ జీవో ఆధారంగా జరిగే ఎన్నికలు చెల్లవని ఆయన తేల్చేశారు. అయన స్వయంగా బీసీ వర్గానికి చెందిన నేత. బీసీ రిజర్వేషన్లకు ఆయన వ్యతిరేకమయ్యే అవకాశం లేదు. రాజకీయంగా ఉన్న అనివార్యతలపైనే ఆయన మాట్లాడారు. అయితే ఆయన బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని విమర్శలకు గురయ్యారు.
రిజర్వేషన్ల హామీ నెరవేర్చడానికే తంటాలు ?
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చడానికి చట్టపరంగా లేని అవకాశాలని కల్పించుకునే ప్రయత్నం చేస్తోంది. తాత్కలికంగా వారి ప్రయత్నాలు ముందుకు సాగవచ్చు కానీ అంతిమంగా ఔట్ పుట్ మాత్రం నిరాశ పరుస్తుందని గతంలో జరిగిన పరిణామాలు నిరూపిస్తున్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. సెంటిమెంట్ రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద రిస్క్ తీసుకుంటోందని అంటున్నారు. చట్టపరంగా జరగవని తేలినప్పుడు... పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం మంచిదన్న వాదన ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఏటికి ఎదురీదే ప్రయత్నాలే చేస్తున్నారు.





















