TS Medical Seats : 8.78 లక్షల నీట్ ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు - తెలంగాణలో పెరిగిన సీట్లతో కల సాకారం !
తెలంగాణలో మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. దీంతో లక్షల్లో ర్యాంక్ వచ్చినా సీటు వస్తోంది.
TS Medical Seats : సాధారణంగా ఎంబీబీఎస్ లో సీటు రావాలంటే ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి. వందల్లో ఉండాలి.. లేకపోతే.. కనీసం వేలల్లో ఉండాలి. కానీ తెలంగాణలో అయితే లక్షల్లో ర్యాంక్ వచ్చినా మెడికల్ సీటు వస్తోంది. తాజా కౌన్సెలింగ్‌లో 8.78 లక్షల నీట్ ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఇది రాష్ట్ర వైద్య విద్య చరిత్రలో సరికొత్త రికార్డని తెలంగాణ వైద్య వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా 8 మెడికల్ కాలేజీలతో అదనంగా 1150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.బి- కేటగిరీలో 85శాతం లోకల్ రిజర్వేషన్ ఉంటుంది. 6శాతం నుంచి 10శాతానికి ఎస్టీ రిజర్వేషన్ పెరిగింది. అందుకే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు భారీగా తగ్గిన మార్కుల కటాఫ్
తగ్గింది. రాష్ట్ర విద్యార్థులకు పెరిగిన వైద్య విద్య అవకాశాలు పెరిగాయి.
జనాభా ప్రాతిపదికన వైద్య విద్య సీట్లలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని, దేశంలో మిగతా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని లేవని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. పీజీ సీట్లలో మాత్రం రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 7.22 పీజీ సీట్లు ఉండగా, దేశంలో మొదటి స్థానంలో నిలిచిన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో 9.06 ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లలో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. పీజీ సీట్లలో కర్ణాటక, తెలంగాణ తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నిలిచాయి.
దేశవ్యాప్తంగా 648 ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 96,077 ఎంబీబీఎస్, 49,790 పీజీ సీట్లు ఉన్నాయి. దేశంలోని మొత్తం సీట్లలో దక్షణాది రాష్ట్రాల్లోనే 40 శాతం ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఏర్పడేనాటికి ఐదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో మరో నాలుగింటిని సర్కారు ప్రారంభించింది. ఆ తర్వాత కొత్తగా 8 మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ 8 కాలేజీల్లో 1,150 ఎంబీబీఎస్ సీట్లు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చాయి. నవంబరు 15 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో 16 జిల్లాల్లో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటువి కూడా కలిపితే 42 అవుతాయి.
Telangana is No.1 in MBBS seats, No.2 in PG seats on basis of population
— Harish Rao Thanneeru (@trsharish) December 27, 2022
Under visionary leadership of #CMKCR garu #Telangana shines like diamond in medical education, despite Central Govt’s discrimination in allotting medical clgs
BJP ruled states are not even in competition! pic.twitter.com/fQvIrcS2vS
ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. మరో 17 జిల్లాల్లో కూడా ప్రారంభిస్తామని చెబుతోంది. వచ్చే ఏడాది కొత్తగా అందుబాటులోకి రానున్న ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు కలిపితే 70కి పైగా అవుతాయని, తద్వారా దేశంలోనే కాలేజీల విషయంలోనూ తెలంగాణ మొదటి స్థానానికి చేరుకుంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు 71 కాలేజీలతో నంబర్ వన్ స్థానంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలకు కూడా స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఉన్నారని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.