Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
AP DGP Harish Kumar Gupta | ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులు ఈ నెల 27వ తేదీ కల్లా దేశం విడిచి పోవాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. కేంద్రం ఆదేశాలు పాటించాలన్నారు.

Pahalgam Terror Attack | అమరావతి: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత హోం మంత్రిత్వశాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు (ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టెర్రరిస్టులు) పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న టూరిస్టులను అత్యంత పాశవికంగా కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పాక్ ప్రభుత్వం దీనిపై విచారణ వ్యక్తం చేయకపోగా, దాంతో తమకు సంబంధం లేదని చెప్పింది. కనీసం ఉగ్రదాడులను కూడా ఖండించకపోవడంతో భారత ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.
ఈ 27వ తేదీలోగా దేశం విడిచి వెళ్లిపోవాలి
1946 ఫారినర్స్ చట్టం సెక్షన్ 3(1) ప్రకారం భారత హోం మంత్రిత్వశాఖ పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. ఇతర వీసాలపై భారత్ వచ్చిన పాకిస్తాన్ పౌరులు ఏప్రిల్ 27వ తేదీనాటికల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. వైద్య సేవల నిమిత్తమై మెడికల్ వీసాపై వచ్చిన పాకిస్తానీయులు అయితే ఏప్రిల్ 29వ తేదీ కల్లా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తాన్ పౌరులకు వీసా సర్వీసులను సస్పెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీర్ఘకాలిక వీసాలు, దౌత్య పరమైన, అధికారిక వీసాలకు ఈ నిబంధనలు వర్తించవు.
పాకిస్తాన్ పౌరులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఉన్నా గుర్తించి, వారందరినీ వారి, వారి దేశానికి తిరిగి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధికారులను ఆదేశించారు. భారత హోం మంత్రిత్వశాఖ జారీచేసిన నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా ఇచ్చిన డెడ్‌లైన్ దాటిన తరువాత ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా ఉండే పాకిస్తాన్ జాతీయులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్
పహల్గాం దాడితో పాక్ పౌరులకు అన్ని రకాల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు శుక్రవారం నాడు అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. పాక్ జాతీయులను గుర్తించి వారి దేశానికి పంపించాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయాలను పాటించాలని ఆదేశించారు. ఈ 27వ తేదీలోగా పాక్ జాతీయులను గుర్తించి వారి దేశానికి పంపేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎవరైనా మెడికల్ అవసరాలపై వచ్చినట్లు అయితే ఏప్రిల్ 29వ తేదీలోగా వారిని సైతం పాకిస్తాన్ కు తిప్పి పంపించాలని స్పష్టం చేశారు. దాంతో వీసా మీద వచ్చిన పాక్ జాతీయుల వివరాలను అధికారులు సేకరించే పనిలో పడ్డారు.
సింధు జలాలపై 1960లో చేసుకున్న ఒప్పందాన్ని భారత్ నిషేధించింది. ఈ మేరకు పాక్ కు సైతం లేఖ ద్వారా స్పష్టం చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు అట్టారి, వాఘా సరిహద్దులు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ హై కమిషన్ లో భారత దౌత్యవేత్తల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించడంతో పాటు న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు సైనిక సలహాదారులను బహిష్కరించింది. మరోవైపు తమ గగనతలంలోకి భారత్ విమానాల రాకపోకలను పాకిస్తాన్ నిషేధించింది. సింధు జలాలను నిలిపివేయాలనుకోవడం యుద్ధ చర్యగా పాక్ అభివర్ణించింది.






















