(Source: ECI/ABP News/ABP Majha)
Telangana DGP: ఇంట్లో జారిపడ్డా, మీ రాజకీయాలకి నన్ను వాడుకుంటారా? రేవంత్ రెడ్డిపై డీజీపీ మహేందర్ రెడ్డి
Mahender Reddy IPS: తెలంగాణకు చెందిన డీజీపీ మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి బిహార్‌కు చెందిన అంజనీ కుమార్‌ను ఇన్‌చార్జ్ డీజీపీగా నియమించారని రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (DGP Mahender Reddy) కొద్ది కాలంగా వ్యక్తిగత సెలవులో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ఇంచార్జ్ డీజీపీగా ప్రస్తుతం ఏసీబీ డీజీగా ఉన్న అంజనీ కుమార్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పటించారు. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహేందర్ రెడ్డిని ప్రభుత్వం బలవంతంగా సెలవుపై పంపించిందని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు చేశారు. అయితే, అందులో ఏ మాత్రం నిజం లేదని మహేందర్ రెడ్డి కొట్టిపారేశారు. తాను ఇంట్లో జారి పడడం వల్ల ఎడమ భుజం పై ఎముక మూడు చోట్ల స్వల్పంగా ఫ్రాక్చర్ జరిగినట్లు ఎక్స్-రే, సిటీ స్కాన్ తేలిందని అన్నారు. ఆ భుజం కదలకుండా కట్టుకట్టినందువల్ల చికిత్స కోసం సెలవులు పెట్టానని మహేందర్ రెడ్డి గురువారం (మార్చి 3) ప్రకటన విడుదల చేశారు.
బోన్ అతుక్కునేందుకు పూర్తి స్థాయిలో విశ్రాంతి కావాలని డాక్టర్లు చెప్పడంతో ఫిబ్రవరి 18 నుంచి మార్చి 4 వరకు సెలవులో వెళ్లినట్లు వివరించారు. తిరిగి, డాక్టర్ల సలహా మేరకు విధుల్లో చేరతారని చెప్పారు. రోజూ భుజానికి అవసరమైన వ్యాయామం, ఫిజియోథెరపీ, మందులను వాడుతున్నట్లు డీజీపీ చెప్పారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలివీ..
తెలంగాణ రాష్ట్రాన్ని బిహార్ ఐఏఎస్‌ల ముఠా ఏలుతూ ఉందని రేవంత్ రెడ్డి నిన్న వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన డీజీపీ మహేందర్ రెడ్డిని పక్కన పెట్టి బిహార్‌కు చెందిన అంజనీ కుమార్‌ను ఇన్‌చార్జ్ డీజీపీగా నియమించారని రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి స్పందించారు.
నిజాలు తెలుసుకోకుండా తనను ప్రభుత్వం బలవంతంగా సెలవులో పంపించిందంటూ తప్పుడుగా మాట్లాడడం సరికాదని మహేందర్ రెడ్డి అన్నారు. తమ రాజకీయ ప్రయోజనాలు, అవసరాల కోసం ప్రభుత్వ అధికారులపై అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఈ తప్పుడు ఆరోపణలు పోలీస్ శాఖ స్థైర్యాన్ని దెబ్బతీయడంతోపాటు, రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగించే ప్రమాదం ఉందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Amaravati What Next : మూడు రాజధానులకు ఇప్పటికీ ఓ మార్గం ! జగన్ ప్లాన్ బీ అమలు చేస్తారా ?
Also Read: Nellore Crime: అబ్బాయిని అమ్మాయిగా మారుస్తూ ప్రాణం తీసిన ముగ్గురు అరెస్ట్