Ramoji Rao: మీడియా మొఘల్ రామోజీ రావుకు ఎడిటర్స్ గిల్డ్ సంతాపం
Eenadu Ramoji Rao Passes Away : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు శనివారం తుదిశ్వాస విడిచారు. రామోజీరావు (88) మృతికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది.

Ramoji Rao Death News: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం వేకువజామున కన్నుమూయడం తెలిసిందే. గుండె సంబంధిత, వయసురీత్యా ఇతరత్రా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో శనివారం ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 88సంవత్సరాలు.
నవతరం జర్నలిస్టులకు స్ఫూర్తి
చెరుకూరి రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా పలు రంగాల్లో రాణించారు. ఆయన చేపట్టిన ప్రతి పనిలో విజయం తనను వరించింది. ఎన్ని చేసినా అన్నింటిలోకి జర్నలిజమే రామోజీ రావుకు అమితంగా ఇష్టమైంది. రోజులో ఎక్కువ సమయం జర్నలిజానికే కేటాయిస్తారు. ప్రతి రోజు వర్తమాన వ్యవహారాల్ని ఆయన సునిశితంగా పరిశీలిస్తారు. తెలుగు భాషపై ఆయనకు పట్టు ఎక్కువ. పద ప్రయోగం, వాక్యనిర్మాణంపై గట్టి పట్టు ఉంది. చెప్పాల్సిన విషయాన్ని అక్షరాల్లో నూరుశాతం ప్రతిబింబించేంత వరకు ఆయన పట్టు వదలరు. న్యూస్ ప్లానింగ్, న్యూస్ జడ్జిమెంట్ రామోజీరావు నుంచి వర్తమాన జర్నలిస్టులు ఎంతగానో చేర్చుకోవచ్చు. ఈనాడు ఇన్ని విజయ శిఖరాలు చేరడానికి తనలో దాగివున్న పాత్రికేయుడే ప్రధాన కారణం. 1987నుంచి కొంత కాలం ఆయన ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా రామోజీరావు పనిచేశారు.
ఎడిటర్స్ గిల్డ్ సంతాపం
రామోజీరావు (88) మృతికి ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. ఆయన ఒక మార్గనిర్దేశకుడిగా కొనియాడింది. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు రామోజీరావు మరణం విచారకరం. మీడియా మెఘల్‌గా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచారు రామోజీరావు. ఆయన ఎన్నో మార్గాల్లో మనందరికీ మార్గనిర్దేశకులు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే గొప్ప వ్యక్తి. మీడియా రంగానికి రామోజీ చేసిన కృషి అమోఘం. దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికి ఆయనో స్ఫూర్తి’’ అని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. ఇది ఇలా ఉంటే రామోజీ రావు మృతికి ఏపీ ప్రభుత్వం రెండ్రోజుల పాలు సంతాప దినాలు ప్రకటించింది. మరో రెండు నెలల్లో ఈనాడు పత్రిక 50ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఆ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు చనిపోయారు. రామోజీ రావు మృతి పట్ల దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

