Lok Sabha Elections 2024: అర్థరాత్రి ప్రధానితో బీజేపీ పెద్దల భేటీ- 2024 ఎన్నికలకు బిగ్ ప్లాన్ - జులై 8న హైదరాబాద్‌లో కీలక సమావేశం.!
Lok Sabha Elections 2024: రాబోయే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అదిరోపోయే ప్లాన్ వేసింది. దేశాన్ని మూడు డవిజన్‌లుగా చేసుకొని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోతోంది.
Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు రాబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ అదిరిపోయే ప్లాన్ వేసింది. మైక్రో మేనేజ్‌మెంట్ కోసం మెగా ప్లాన్ సిద్ధం చేసింది. పార్టీ పని తీరును సరళీకృతం చేయడానికి బీజేపీ మొదటి సారిగా దేశాన్ని మూడు విభాగాలుగా విభజించింది. ఇందుకోసం బీజేపీ ఉత్తర ప్రాంతం, దక్షిణ ప్రాంతం, తూర్పు ప్రాంతాన్ని నిర్ణయించింది. జులై 6, 7, 8 తేదీల‌్లో దేశంలోని వివిధ ప్రాంతాల‌్లో పార్టీ నేతలతో బీజేపీ అధ్యక్షుడు జేపి నడ్డా సమావేశం కాబోతున్నారు. ఈక్రమంలోనే జులై 6వ తేదీన ఈస్ట్ రీజియన్, 7న నార్త్ రీజియన్, 8న సౌత్ రీజియన్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
సమావేశం ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారు?
ఈ సమావేశంలో మండల, రాష్ట్ర ఇంఛార్జీలతోపాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక మంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవుతారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. జులై 6వ తేదీన గౌహతిలో ఈస్ట్ రీజియన్ సమావేశం జరగనుంది. ఇందులో బిహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల నుంచి పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులు సమావేశంలో పాల్గొంటారు.
జులై 7వ తేదీన ఢిల్లీలో ఉత్తర ప్రాంత సమావేశం జరగనుంది. ఇందులో జమ్మూ-కశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, గుజరాత్, డామన్ డయ్యూ-దాదర్ నగర్ హవేలీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానాకు చెందిన బీజేపీ నేతలు పాల్గొంటారు.
జులై 8వ తేదీన హైదరాబాద్‌లో సౌత్ రీజియన్ సమావేశం జరగనుంది. ఇందులో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ముంబై, గోవా, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ పార్టీల అధికారులతో చర్చలు జరుపుతారు.
ప్రధాని నివాసంలో ప్రత్యేక సమావేశం..
ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటన అనంతరం బుధవారం (జూన్ 28) రోజు ఆయన నివాసంలో బీజేపీ సమావేశం జరిగింది. ఈ భేటీలో 2023 చివరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఆర్గనైజేషన్ లీడర్ బీఎల్ సంతోష్ పాల్గొన్నారు. అయితే సంస్థలో పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మేధోమథనం తర్వాత ప్రధాని మోదీతో ఈ సమావేశం జరిగిందని, ఇలాంటి పరిస్థితిలో పార్టీలో చాలా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీల గడువు ముగియనుంది. ఈ ఏడాది చవరి నాటికి ఈ ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు.. ఎక్కువగా ఈ ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా తరచుగా పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నెలలో రెండు సార్లు ఈ రాష్ట్రాలకు వెళ్లి వస్తున్నారు.