Chief Election Commissioner: భారత ఎన్నికల సారథిగా జ్ఞానేష్ కుమార్, ఈసీగా వివేక్ జోషి నియామకం - గెజిట్ నోటిఫికేషన్లు విడుదల
Election commission Of India | భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు రెండు వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

CEC Gyanesh Kumar | న్యూఢిల్లీ: భారత్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ (త్రిసభ్య కమిటీ) సోమవారం నాడు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా, ఎన్నికల కమిషనర్‌గా జోషి పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు రెండు వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు సైతం విడుదలయ్యాయి.
కొత్త చట్టం ప్రకారం తాజాగా నియామకాలు
కొత్త చట్టం ప్రకారం నియమితులైన మొదటి CEC జ్ఞానేష్ కుమార్ కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనన్ ప్రకటించే ముందు, అంటే జనవరి 26, 2029 వరకు ఆయన భారత ఎన్నికల సంఘం సారథిగా సేవలు అందించనున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుుమార్ గడువు మంగళవారం ముగియనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ సీఈసీ, ఈసీ పదవులకు కొత్త వ్యక్తులను ఎంపిక చేసి రాష్ట్రపతి ముర్ముకు సిఫార్సు చేశారు. త్రిసభ్య కమిటీ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అనంతరం గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సుఖ్‌బీర్ సింగ్ సంధుతో పాటు వివేక్ జోషి మరో ఎన్నికల కమిషనర్‌గా సేవలు అందించనున్నారు.
కమిటీ సిఫార్సుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం
"ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, పదవీకాలం) చట్టం, 2023 లోని సెక్షన్ 4 ద్వారా ఈ నియామకం జరిగింది. ఫిబ్రవరి 19, 2025 నుంచి ఈ గెటిజ్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకం జరిగిందని న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎవరీ జ్ఞానేష్ కుమార్..
మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు జ్ఞానేష్ కుమార్. ఆయన కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత ఏడాది మార్చి (2024)లో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. 2019లో కేంద్రం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంశాఖలో కశ్మీర్ డివిజన్ కు అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శిగ ఉన్నారు. 2024 జనవరిలో సహకార శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు, పని గుర్తింపుతో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన 2029 జనవరి 26వ తేదీ వరకు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే బిహార్ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం అంటే అంత ఆషామాషీ కాదు.
ఈసీగా వివేక్ జోషి..
ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వివేక్ జోషి హరియాణా క్యాడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

