కడలి లోతుల్లోని ఖనిజాల కోసం భారత్ సాహసం, త్వరలోనే సముద్రయాన్ మిషన్ - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్
Samudrayan Mission: భారత్ చేపట్టనున్న సముద్ర యాన్ మిషన్‌కి సంబంధించి ABP News కీలక వివరాలు సేకరించింది.
Samudrayan Mission:
2024లో సముద్ర యాన్ మిషన్..
నార్త్ అట్లాంటిక్ సముద్రంలో టైటాన్ సబ్‌మరైన్ (Titan Submarine) మునిగిపోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 13వేల మీటర్ల కన్నా ఎక్కువ లోతులోకి వెళ్లడం వల్ల అక్కడ సముద్ర పీడనాన్ని తట్టుకోలేక అది పేలిపోయింది. అందులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. సముద్ర గర్భంలో రహస్యాలను ఛేదించాలనుకునే వాళ్లకు ఈ ప్రమాదం ఓ వార్నింగ్ సైన్ (Warning Sign) అయింది. అసలు ఆ సబ్‌మరైన్ తయారీలోనే చాలా లోపాలున్నాయన్న వాదనలు వినిపించాయి. దీనిపై అంతర్జాతీయంగా డిబేట్ జరుగుతుండగానే...భారత్ చేపట్టిన ఓ ప్రాజెక్ట్ ఆందోళనకు గురి చేస్తోంది. అదే Samudrayan Mission. భారత దేశ చరిత్రలో తొలిసారి ఈ సాహసానికి సిద్ధమవుతున్నారు. మనుషులతో కూడిన సబ్‌మరైన్‌ని 6 వేల మీటర్ల లోతులోకి పంపడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. 2024లో తొలి త్రైమాసికం (First Quarter)లో దీన్ని చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది ఇండియా. అంతకు ముందు ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా..మొదట ముగ్గురిని ఆ సబ్‌మరైన్‌లో పంపనున్నారు. 500 మీటర్ల లోతు వరకూ వెళ్తారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి కీలక వివరాలను ABP Newsతో పంచుకున్నారు National Institute of Ocean Technology (NIOT) డైరెక్టర్ డాక్టర్ జీఏ రామదాస్ (GA Ramadass).2026 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుంది.
"సముద్రయాన్ మిషన్ 2026నాటికి పూర్తి స్థాయిలో పట్టాలెక్కుతుంది. ఆలోగా 2024 ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ట్రయల్స్ మొదలవుతాయి. ముగ్గురు సిబ్బంది ఆ సబ్‌మరైన్‌లో 500 మీటర్ల లోతు వరకూ వెళ్తారు. 2025 చివర్లో 6 వేల మీటర్ల లోతులోకి వెళ్లి ట్రయల్స్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం"
- జీఏ రామదాస్, ఎన్‌ఐఓటీ డైరెక్టర్
లక్ష్యం ఏంటి..?
ఈ మిషన్ కోసం NIOT ప్రత్యేకంగా ఓ సబ్‌మరైన్‌ని తయారు చేసింది. అదే MATSYA-6000. ఇందులో ముగ్గురు సిబ్బంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సముద్ర గర్భంలో ఖనిజాలను కనుగొనేందుకు 6 వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధనలు చేస్తారు. ముఖ్యంగా నికెల్, మాంగనీస్, కోబాల్ట్ లాంటి అరుదైన ఖనిజాల అన్వేషణ చేపడతారు. ఇప్పటికే అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా ఈ తరహా జలాంతర్గాములు తయారు చేసుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో భారత్ కూడా చేరిపోయింది. ఇప్పటికే కేంద్రం ఇందుకోసం రూ.4,077 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అయితే...టైటాన్ ప్రమాదం నేపథ్యంలో మరోసారి ఈ మత్స్య 6000 మాడ్యూల్‌ని పరిశీలించినట్టు ABP Newsతో జీఏ రామదాస్ వెల్లడించారు.
"టైటాన్ విషయంలో ఏం జరిగిందో చూశాం. అందుకు తగ్గట్టుగానే మా మాడ్యూల్‌ని మరోసారి చెక్ చేశాం. డిజైన్ నుంచి మెటీరియల్‌ని సెలెక్ట్ చేసుకునే వరకూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. సేఫ్‌టీ సర్టిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇవన్నీ ఉన్నాక...ప్రమాదం సంభవించడం చాలా అరుదు. అయినా సరే...అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాం"
- జీఏ రామదాస్, ఎన్‌ఐఓటీ డైరెక్టర్
సేఫ్‌టీ ఎలా..?
MATSYA-6000కి నార్వే సర్టిఫికేషన్ ఏజెన్సీ Det Norske Veritas సర్టిఫికేట్ ఇచ్చింది. 10వేల మీటర్ల లోతు వరకూ వెళ్లే సబ్‌మరైన్స్‌ని పరిశీలించి వాటికి సర్టిఫికేట్‌లు ఇస్తూ ఉంటుంది ఈ సంస్థ. ఇప్పుడు సముద్రయాన్ మిషన్ కోసం తయారు చేసిన సబ్‌మరైన్‌ని టైటానియమ్ అల్లాయ్‌తో (Titanium Alloy) తయారు చేశారు. సబ్‌మరైన్‌కి Hull చాలా ముఖ్యం. హల్ అంటే సబ్‌మరైన్ బాడీ. 6 వేల మీటర్ల లోతులోకి వెళ్లినప్పుడు అక్కడి ప్రెజర్‌ని తట్టుకునేలా ఆ బాడీని తయారు చేయాల్సి ఉంటుంది. సముద్ర యాన్ కోసం తయారు చేసిన సబ్‌మరైన్‌ని...సాధారణ ఒత్తిడి కంటే 1.2 రెట్లు ఎక్కువ అప్లై చేసి మరీ టెస్ట్ చేసి మరీ అప్రూవ్ చేశారు. ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ రికవరీ సిస్టమ్స్..ఇలా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ పరిస్థితుల్లో 16 గంటల వరకూ..అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల పాటు అది సముద్రంలో ఉండగలిగేలా డిజైన్ చేశారు. సముద్రం లోపలికి వెళ్లేందుకు 4 గంటలు, తిరిగి వచ్చేందుకు మరో 4 గంటలు పడుతుంది. లోపల 4 గంటల పాటు పరిశోధనలు చేస్తారు. ఇక కమ్యూనికేషన్ విషయానికొస్తే...సబ్‌మరైన్‌కి సమీపంలోనే Mother Ship ని ఉంచేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ABP Newsతో చెప్పారు రామదాస్.
"అంతరిక్ష యాత్రల్లో లాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ కమ్యూనికేషన్ సిస్టమ్ వీటికి పనికి రాదు. అందుకు బదులుగా అకాస్టిక్ కమ్యూనికేషన్‌ని వినియోగించనున్నాం. ఇది చాలా నెమ్మదిగా పని చేస్తుంది. అయినా...ఇలాంటి మిషన్స్‌కి ఇది ఎంతో అవసరం"
- జీఏ రామదాస్, ఎన్‌ఐఓటీ డైరెక్టర్