Breaking News: మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్
Latest Telugu Breaking News: ఏపీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అనూహ్య తీర్పు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE
Background
Andhra Pradesh And Telangana Latest News: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అనూహ్య తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షం అనేది లేకుండా మొత్తం ఓట్లను కూటమికే కుమ్మరించారు. గతంలో వైసీపీకీ 151 అసెబ్లీ సీట్లు వస్తేనే అద్భుతం అనుకున్నారు. కానీ అంతకు మించిన ఓటుశాతాన్ని సీట్లను కూటమి పార్టీలకు కట్టూబెట్టారు. టీడీపీ 136 స్థానాల్లో విజయం కేతనం ఎగరేస్తే... జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయ దుందుబి మోగించింది. బీజేపీ 8 స్థానాలు తగ్గించుకుంది. వైపీపీ మాత్రం కేవలం అంటే కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా అరుదైన సన్నివేశంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
8 స్థానాల్లో ఖాతా తెరవని వైసీపీ
ఘోర పరాజయం పొందిన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాలో కనీసం బోణీ చేయలేకపోయింది. వైసీపీ బోణీ చేయని జిల్లాలు:- శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం మిగతా జిల్లాలు చూస్తే విశాఖ పట్నం, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాలో రెండేసి స్థానాలు దక్కించుకుంది. కడలో మూడు స్థానాలు నెగ్గింది.
ఎంపీ స్థానాల విషయంలో కూడా కూటమికే పట్టం కట్టారు ఓటర్లు. టీడీపీ 16 స్థానాలు నెగ్గింది. జనసేన రెండు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. వైసీపీ మాత్రం నాలుగు ఎంపీ స్థానాలకే పరిమితం అయింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలోల ఎక్కువ సీట్లు సాధించిన పార్టీల్లో టీడీపీ రెండో స్థానంలో ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ 8 స్థానాలు దక్కించుకుంటే, బీజేపీ పోటీగా 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం తనస్థానాన్ని నిలబెట్టుకుంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా కైవశం చేసుకోలేదు. చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా పొందలేకపోయింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లు కూాడా ఓటమి పాలయ్యారు.
ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఇబ్బంది పడుతున్న బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి మరింత కుంగదీస్తోంది. ఫలితాల దెబ్బకు ఆ పార్టీలో నిశ్చబ్ధ వాతావరణం నెలకొంది. అటు కాంగ్రెస్‌లో కూడా అదే పరిస్థితి కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోష్ మీద ఉన్నట్టు కనిపించినా కేవంల సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
జాతీయ స్థాయిలో కూడా ప్రజలు ఆశ్చర్యకరమైన ఫలితాలు ఇచ్చారు ప్రజలు. 542 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు 293 స్థానాలు కట్టబెట్టిన ప్రజలు ఇండీ కూటమికి 233 స్థానాలు అప్పగించారు. ఇతరులకు 17 స్థానాలు ఇచ్చారు. ఇలా దేశవ్యాప్తంగా ఓటు నాడి పట్టుకోవడంలో దాదాపు అన్ని సర్వే సంస్థలు లెక్క తప్పాయి.
కూటమి ఎక్కువ సీట్లు సాధించడంతో జగన్ మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపించారు. వెంటనే ఆయన్న దాన్ని ఆమోదించారు. 9వ తేదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అమరావతిలో ప్రమాణం చేయనున్నారు. దీని ఏర్పాట్లపై చర్చించేందుకు సీఎస్ జవహర్ రెడ్డి చంద్రబాబుతో సమావేశం కానున్నారు.
ఢిల్లీలో ఈ సాయంత్రం ఎన్డీఏ పార్టీల భేటీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు.
మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) కూటమి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీని కూటమి నేతలు ఎన్నుకున్నారు. ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీకి కూటమి నేతలు మద్దతు తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్ మద్దతు లేఖలను అందజేశారు.
ప్రధాని రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు.
నంబర్ గేమ్ మొదలైంది, అంతా సిద్ధంగా ఉండండి - మంత్రులతో మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా సమర్పించే ముందు కేంద్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించారు. జూన్ 8వ తేదీన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులతో సమావేశమైన ఆయన తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. గెలవడం, ఓడిపోవడం రాజకీయాల్లో అత్యంత సహజమని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.
చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: రేవంత్ రెడ్డి
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు (Chandrababu) ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళ్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్న రేవంత్.. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు.
Breaking News: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. పవన్ కల్యాణ్ కూడా కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన కూడా సమావేశానికి హాజరుకానున్నారు.