Delhi minister : విషమించిన ఢిల్లీ మంత్రి అతిషి ఆరోగ్య పరిస్థితి.. ఆసుపత్రికి తరలింపు
Delhi health minister Athishi : ఢిల్లీ ప్రజల నీటి కష్టాలను తీర్చాలన్న డిమాండ్ తో దీక్షకు దిగిన మంత్రి అతిషి ఆరోగ్యం విషమంగా మారింది. బరువు తగ్గడంతోపాటు కీటోన్లు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
Delhi Minister Athishi Health Problem : ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఉన్న నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జల వనరుల శాఖ మంత్రి అతిషి మర్లేనా నాలుగు రోజుల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దక్షిణ ఢిల్లీలోని భోగాల్లోని సమర పంథాల్ లో నాలుగు రోజులు కిందట ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ వంటి నేతల సమక్షంలో ఆమె దీక్షకు పూనుకున్నారు. నాలుగు రోజుల నుంచి ఆమె తన దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే సోమవారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా క్షీణించడంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన వ్యక్తం అయింది. సోమవారం రాత్రి మంత్రి అతిషి రక్తంలో షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. వైద్యుల సూచనల మేరకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సంజయ్ సింగ్, ఇతర నాయకులు మంత్రిని లోక్ నాయక్ జయప్రకాష్ హాస్పిటల్ కి తరలించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న ఎంపీ సంజయ్ సింగ్..
దీక్షకు దిగిన మంత్రి అతిషి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ అతిషి రక్తంలో షుగర్ లెవల్స్ 43 కు చేరుకున్నాయని, ఆమె ఆరోగ్యం క్షీణించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరకపోతే పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో కొద్దిరోజులుగా నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని ఉద్దేశంతోనే ప్రజల కోసం ఆమె దీక్షకు దిగినట్లు ఎంపీ వెల్లడించారు. ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు.
పెరుగుతున్న కీటోన్లు
దీక్షలో కూర్చున్నప్పటి మంత్రి ఆహారం తీసుకోవడం లేదు. షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. కీటోన్లు పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. అదే సమయంలో రక్త పోటు కూడా తగ్గుతోందని వైద్యులు వెల్లడించారు. ఆమెను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరి కొన్ని గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని, ఆ తరువాత ఆమె పరిస్థితి గురించి స్పష్టంగా చెప్పగలుగుతామని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆమె బరువు కూడా తగ్గుతూ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. నాలుగు రోజుల దీక్ష తర్వాత అతిషి 2.2 కిలోలు బరువు తగ్గినట్లు వైద్యులు వెల్లడించారు. బరువు తగ్గడంతో పాటు ఇతర ఇబ్బందులు ఉన్న నేపథ్యంలోనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించాలని సూచించినట్లు వైద్యులు వెల్లడించారు. మంత్రి నిరాహార దీక్ష విరమించేందుకు నిరాకరించినప్పటికీ బలవంతంగా పార్టీ నాయకులు ఆసుపత్రిలో చేర్పించారు. దీక్షకు ముందు మంత్రి బరువు 65.19 కిలోలు కాగా, నాలుగో రోజుకు దీక్ష చేరిన తర్వాత 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో షుగర్ లెవెల్స్ 28 యూనిట్లు తగ్గాయి. రక్తపోటు స్థాయి కూడా భారీగా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతోపాటు కీటోన్ స్థాయి పెరుగుతోంది.
ఈనెల 21 నుంచి దీక్ష చేపట్టిన మంత్రి అతిషి..
ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి సరైన నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జల వనరుల శాఖామంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కూడా ఆమె మాట్లాడుతూ తన ఆరోగ్యం ఎంత క్షీణించినా దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీకి అదనపు నీరు వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామన్నారు. ఢిల్లీలో నీటి కొరత ఉన్నందున, దాన్ని పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష చేస్తున్నానని మంత్రి దీక్షకు దిగిన సందర్భంలో వెల్లడించారు. ఢిల్లీకి సొంత నీళ్ళు లేవని, ఢిల్లీలోని ప్రజలు వినియోగించే నీళ్లన్నీ పక్క రాష్ట్రాల నుంచి వస్తాయన్నారు. అయితే, గడిచిన మూడు వారాలుగా హర్యానా ఢిల్లీకి నీళ్లు పంపడం తగ్గించిందని ఆమె ఆరోపించారు. ఢిల్లీ ప్రజలకు ప్రతిరోజు 100 ఎంజిడి నీరు అంటే 46 కోట్ల లీటర్ల నీరు అవసరమవుతుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఈ నీటిని ఒక్క రోజులోనే 28 లక్షల మంది ప్రజలు వినియోగిస్తారన్నారు. హర్యానా నుంచి నీటి సరఫరా లేకపోవడంతో ప్రతి బొట్టు నీటి కోసం 28 లక్షల మంది ప్రజలు అల్లాడుతున్నారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.