Dhanush - Traffic Challan : ధనుష్ ఇంటికి పోలీసులు - కొడుకు చేసిన పనికి చలాన్
Dhanush son Yatra bike riding video gone viral: చెన్నైలో ధనుష్ ఇంటికి పోలీసులు వెళ్లారు. ఆయన పెద్ద కొడుకు చేసిన పనికి చలాన్ విధించారు. ఇంతకీ, ధనుష్ కొడుకు ఏం చేశాడు? అనే వివరాల్లోకి వెళితే...
చట్టం ఎవరికి అయినా ఒక్కటే అని చెన్నై పోలీసులు చాటి చెప్పారు. సినిమా తారల విషయంలో తాము పక్షపాత ధోరణితో వ్యవహరించడం లేదని తమ చర్యల ద్వారా చూపించారు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోల పట్ల పోలీసుల వ్యవహార ధోరణి ఏ విధంగా ఉందనేది చెప్పడానికి చెన్నైలో జరిగిన అంశం ఓ ఉదాహరణ. పూర్తి వివరాల్లోకి వెళితే...
ధనుష్ ఇంటికి వెళ్ళిన పోలీసులు
తమిళ స్టార్ హీరోలలో ఒకరు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ధనుష్ ఇంటికి ట్రాఫిక్ పోలీసులు వెళ్లారు. ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు రూ. 1000 జరిమానా విధించారు. దీనికి కారణం సోషల్ మీడియా!
సోషల్ మీడియాలో వైరలైన యాత్ర వీడియో
చెన్నైలోని పోయెస్ గార్డెన్ ఏరియాలో ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర బైక్ రైడింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాన్ని చూసిన పోలీసులు ధనుష్ ఇంటికి వెళ్లి ఫైన్ వేశారు.
యాత్ర బైక్ రైడింగ్ నేర్చుకుంటున్నాడని, అతడితో వెంట ట్రైనర్ కూడా ఉన్నారని ధనుష్ కుటుంబ సభ్యులు వివరించారు. అయితే... హెల్మెంట్ లేకుండా బండి నడపకూడదని, అందుకు గాను జరిమానా విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అదీ సంగతి! నిష్పక్షపాతంగా వ్యవహరించిన ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
విడాకుల తర్వాత రజనీకాంత్ ఇంటిలో మనవళ్లు
ధనుష్, రజనీకాంత్ పెద్ద కుమార్తె సౌందర్యకు ఇద్దరు కుమారులు. వారిలో యాత్ర పెద్ద కుమారుడు. అతని వయసు 17 ఏళ్ళు. రెండో కుమారుడి పేరు లింగ. ప్రస్తుతం వాళ్లిద్దరూ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటిలో ఉంటున్నారు. ధనుష్, ఐశ్యర్య వివాహం 2004లో జరిగింది. అయితే... 17 ఏళ్ళ విరామం తర్వాత 2022, జనవరిలో తాము విడిపోతున్నట్లు వాళ్లిద్దరూ వెల్లడించారు. అప్పటి నుంచి తండ్రి ఇంట్లో ఐశ్వర్య ఉంటున్నారు. ఆమెతో పాటు కుమారులు కూడా ఉంటున్నారు.
Also Read : మంగళవారం సినిమా రివ్యూ: అమ్మాయిలో లైంగిక వాంఛ ఎక్కువ అయితే? కోరికలు పెరిగితే?
సినిమాల విషయానికి వస్తే... మాజీ భార్య భర్తలు సంక్రాంతి బరిలో తమ తమ సినిమాలతో పోటీ పడనున్నారు. సంక్రాంతికి విడుదల అవుతున్న తమిళ సినిమాల్లో 'లాల్ సలామ్', 'కెప్టెన్ మిల్లర్' ఉన్నాయి. మొదటి సినిమాలో రజనీకాంత్ ఓ ప్రత్యేక పాత్ర చేశారు. ఆ సినిమాకు ఐశ్వర్య దర్శకురాలు. రెండో సినిమాలో ధనుష్ హీరో.
రజనీకాంత్ అల్లుడు అంటే తమిళ ప్రేక్షకుల మదిలో మెదిలే పేరు ధనుష్. సూపర్ స్టార్ అల్లుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ధనుష్ నటన, అతని ప్రతిభను తక్కువ అంచనా వేయడం కాదు కానీ... రజనీ అల్లుడు ఇమేజ్ విజయాల్లో ఆయనకు ఎంతో కొంత సాయం చేసిందనేది వాస్తవం. అయితే... ఇప్పుడు వాళ్ళు మామా అల్లుళ్లు కాదు. అందువల్ల, ఆ రెండు సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
Also Read : 'సప్త సాగరాలు దాటి సైడ్ బి' సినిమా రివ్యూ: రక్షిత్ శెట్టి బ్లాక్ బస్టర్ కొట్టారా? డిజప్పాయింట్ చేశారా?