RRR Akahnda - IFFI : ఇఫీలో 'ఆర్ఆర్ఆర్', 'అఖండ' - భారతీయ సినిమాపై ఇది టాలీవుడ్ ముద్ర
International Film Festival : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)ని వచ్చే నెల 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్నారు. ఆ చలన చిత్రోత్సవాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది.
భారతీయ సినిమా అంటే ఒకప్పుడు హిందీ సినిమా అనుకునేవారు. కానీ, ఇప్పుడు హిందీ సినిమాకు దక్షిణాది సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా! ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ హిస్టరీలో బిగ్గెస్ట్ హిట్ అంటే 'బాహుబలి' అని చెప్పాలి. దాని తర్వాత స్థానాల్లో 'ఆర్ఆర్ఆర్' కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దాని కంటే ముఖ్యంగా తెలుగు సినిమాగా విడుదలైన 'అఖండ' కూడా జాతీయ స్థాయిలో ప్రేక్షకులను, ఇఫీ సెలెక్షన్ కమిటీని ఆకట్టుకుంది.
ఇఫీ మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్‌లో....
'ఆర్ఆర్ఆర్' అండ్ 'అఖండ'!
RRR Movie and Akhanda selected for IFFI 2022 screening : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ప్రతి ఏడాది గోవాలో జరుగుతుంది. ఈసారి నవంబర్ 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు గోవాలో నిర్వహించనున్నారు. ఆ చలన చిత్రోత్సవాల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. మొత్తం 25 ఫీచర్ ఫిలిమ్స్, 20 నాన్ ఫీచర్ ఫిలిమ్స్ సెలెక్ట్ చేయగా... అందులో ఐదు తెలుగు సినిమాలు ఉన్నాయి.
మెయిన్ స్ట్రీమ్ సినిమా విభాగంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'అఖండ' సినిమాను ఎంపిక చేసినట్లు ఇఫీ వెల్లడించింది. దీంతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కూడా చోటు సొంతం చేసుకుంది.
చిన్న సినిమాగా విడుదలై... చాప కింద నీరులా దేశంలో ప్రేక్షకుల అందరి చూపు తనవైపు తిప్పుకొన్న హిందీ సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్', బెంగాలీ సినిమా 'టానిక్', మరాఠీ సినిమా 'ధర్మవీర్ ముక్కం పోస్ట్ థానే' కూడా మెయిన్ స్ట్రీమ్ సినిమా సెక్షన్ విభాగంలో చోటు దక్కించుకున్నాయి. పన్నెండు మంది సభ్యులతో కూడిన ఇఫీ బృందం మొత్తం 354 సినిమాలు చూసి... 25 ఫీచర్ ఫిలిమ్స్ సెలెక్ట్ చేసింది. అందులో ఐదు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఉన్నాయి. ఆ ఐదు సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కావడం తెలుగు చిత్రసీమ, ప్రేక్షకులకు గర్వకారణం అని చెప్పాలి.
సినిమా బండి...
ఖుదీరాం బోస్...
'మేజర్' కూడా!
'అఖండ', 'ఆర్ఆర్ఆర్' కూడా మరో మూడు తెలుగు సినిమాలను కూడా ఈ ఏడాది 'ఇఫీ'లో ప్రదర్శించనున్నారు. 'సినిమా బండి' (Cinema Bandi - 53rd IFFI), 'ఖుదీరాం బోస్' (Kudhiram Bose - 53rd IFFI), 'మేజర్' సినిమాలకు ఫీచర్ ఫిలిమ్స్ విభాగంలో గౌరవం దక్కింది. అయితే... ఇఫీ విడుదల చేసిన లిస్టులో 'మేజర్'ను హిందీ సినిమాగా పేర్కొనడం విశేషం. తెలుగు, హిందీ భాషల్లో ఆ సినిమాను తెరకెక్కించారు. హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్కాతో పాటు ఆ సినిమా (Major - 53rd IFFI) కు చాలా మంది తెలుగు చలన చిత్ర పరిశ్రమ ప్రముఖులు పని చేశారు. మహేష్ బాబు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.
Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్
ఇఫీలో ప్రదర్శనకు ఎంపికైన 'ఖుదీరాం బోస్' ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓటీటీలో విడుదలై భారీ స్థాయిలో వీక్షకుల ప్రశంసలు అందుకున్న సూర్య 'జై భీమ్' ఇఫీ ఎంపిక చేసిన చిత్రాల జాబితాలో ఉంది. నాన్ ఫీచర్ విభాగంలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.