Viral Video: వీడు అసలు మనిషేనా? ఓ ప్రాణం తీశానని కూడా లేదు- వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో చూశారా
Vadodara Road Accident | గుజరాత్ లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో యువకుడు కారుతో వేరే వాహనాలపైకి దూసుకెళ్లడంతో విషాదం చోటుచేసుకుంది.

Road Accident in Vadodara | వడోదర: గుజరాత్‌లోని వడోదరలో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపుతోంది. కరేలిబాగ్ ప్రాంతంలో గురువారం రాత్రి మద్యం మత్తులో ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు. పలు వాహనాలను తన కారుతో ఢీకొట్టగా స్కూటీ మీద వెళ్తున్న యువతి ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ సీసీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికులు వెంబడించి పారిపోతున్న నిందితుడ్ని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు నిందితుడ్ని అప్పగించగా.. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడ్ని ఎంఎస్ యూనివర్సిటీ లా స్టూడెంట్ రక్షిత్ రావిష్ చౌరాసియాగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో వాహనం నడపడమే తప్పు. అలాంటిది రోడ్డు వాళ్ల బాబు సొత్తు అన్నట్లు దూసుకెళ్లి హల్ చల్ చేసిన యువకుడ్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
వడోదరలో రద్దీగా ఉండే జంక్షన్లలో కరేలిబాగ్‌లోని అమ్రపాలి జంక్షన్ ఒకటి. గురువారం రాత్రి కొందరు యువకులు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా ఇతర వాహనాలపైకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సిసిటివి ఫుటేజ్ ప్రకారం చూస్తే.. బ్లాక్ కలర్ కారు అతివేగంతో దూసుకొచ్చి ఓ స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. అనంతరం మరికొన్ని వాహనాలను ఢీకొడుతూ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని హేమాలిబెన్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు.
మరికొందరు వాహనారులు ఛేజ్ చేసి యాక్సిడెంట్ చేసిన కారును అడ్డుకున్నారు. ప్రమాదంలో గాయపడిన నిషాబెన్ (35), జైని (12), 10 ఏళ్ల బాలిక, 40 ఏళ్ల వ్యక్తిని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కారును అడ్డుకున్న తరువాత డ్రైవింగ్ చేసిన యువకుడి ఫ్రెండ్స్ కారు దిగ్గి పిచ్చోడు యాక్సిడెంట్ చేశాడు. మాకేం సంబంధం లేదన్నారు. మరోవైపు డ్రైవింగ్ చేసిన యువకుడు మాత్రం.. ఇంకో రౌండ్, ఇంకో రౌండ్.. ఇలాంటి సీన్ రిపీట్ అవుతుంది. ఓం నమ: శివాయ అని నినాదాలు చేశాడు. వాహనం దిగిన తరువాత యువకుడు దురుసుగా మాట్లాడటం, ఎలాంటి తప్పు చేశానన్న ఫీలింగ్ లేకపోవడం.. మరో రౌండ్ మరో రౌండ్ అని అరవడంతో నిందితుడ్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.
On the night of #HolikaDahan, a young man ran over five people with his speeding car in #Vadodara, #Gujarat.
— Chaudhary Parvez (@ChaudharyParvez) March 14, 2025
One person died, and four others were injured.#india #Breaking #accident pic.twitter.com/pHbGuwovo2
జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ లీనా పాటిల్ ప్రమాదంపై స్పందించారు. డ్రైవింగ్ చేసిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని.. స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసి, అతడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం మత్తులో ఉండటంతో పాటు అతివేగంగా వాహనాన్ని నడపటం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. కేవలం మద్యం సేవించాడా.. లేక మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు లాంటి తీసుకున్నాడా అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






















