Atrangi Re Trailer: ‘అత్రంగి రే’ ట్రైలర్: ఇద్దరితో ప్రేమ.. ఇష్టంలేని పెళ్లి.. ఇద్దరూ కావాలంటూ అమ్మాయి లొల్లి!
ఆమె ప్రేమించినవాడినీ ప్రేమిస్తుంది.. పెద్దలు బలవంతంగా కట్టబెట్టిన వ్యక్తినీ ప్రేమిస్తుంది. ఇంతకీ ‘అత్రంగీ’ కథేంటీ?
అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘అత్రంగి రే’ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ఇందులో సారా అలీ ఖాన్ ఛాలెంజింగ్ పాత్రను పోషించింది. ఇద్దరి వ్యక్తులను ఒకేసారి ప్రేమించి.. ఇద్దరినీ వదుకోలేక తికమకపడే అమ్మాయిగా సారా జీవించిందనే చెప్పాలి. ఇక ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. అక్షయ్ కుమార్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. ట్రైలర్ చూస్తే మీకు ఈ భావనే కలుగుతుంది.
ఇక ట్రైలర్‌లోకి తొంగి చూస్తే.. సారా కుటుంబికులు ఎవరు దొరికితే వారితో ఆమెకు పెళ్లి చేసి వదిలించుకోవాలని అనుకుంటారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన ధనుష్‌ను బంధించి తీసుకొస్తారు. ఏ మాత్రం పరిచయంలేని అతడితో సారాకు బలవంతంగా పెళ్లి చేస్తారు. ఆ తర్వాత వారిద్దరూ రైల్లో ప్రయాణిస్తారు. ఈ సందర్భంగా ధనుష్‌కు కూడా ఆ పెళ్లి ఇష్టం లేదని సారా సంతోషిస్తుంది. ఇదివరకు తాను ఓ వ్యక్తిని ప్రేమించానని చెబుతుంది. అతడే అక్షయ్ కుమార్. ఇందులో అక్షయ్ ఇంద్రజాలికుడుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏనుగుపై తనదైన స్టైల్లో ఎంట్రీ ఇచ్చే అక్షయ్ రాకతో కథ మలుపు తిరుగుతుందనిపిస్తుంది. అయితే, తన ప్రియుడిని కలిసినా సరే.. ధనుష్‌ను సారా వదల్లేకపోతుంది. తనకు ఇద్దరూ కావాలంటుంది. అలాగే, ధనుష్ కూడా సారాను ఇష్టపడటం మొదలుపెడతాడు. మరి చివరికి ఏం జరుగుతుందనేది బుల్లితెరపైనే చూడాలి. ఎందుకంటే.. ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం లేదు. ‘డిస్నీ హాట్ స్టార్’లో డిసెంబరు 24న నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
Also Read: ‘జెర్సీ’ హిందీ ట్రైలర్: సేమ్ టు సేమ్.. కానీ, ‘అర్జున్ రెడ్డి’ తరహాలో హాట్ సీన్స్!
వయస్సుపై వివాదం: ఈ సినిమా తారాగాణాన్ని ప్రకటించేప్పుడు సారా అలీ ఖాన్ వయస్సుకు.. హీరో అక్షయ్ కుమార్, ధనుష్‌ల వయస్సుపై పెద్ద చర్చే జరిగింది. అయితే, ట్రైలర్ చూసిన తర్వాత.. అందరి సందేహాలకు దాదాపు పుల్‌స్టాప్ పడినట్లే. 26 ఏళ్ల సారాతో 54 ఏళ్ల అక్షయ్ కుమర్, 38 ఏళ్ల ధనుష్ రొమాన్సా? అని అంతా పెదవి విరిచారు. దీంతో దర్శక నిర్మాతలు దీనిపై క్లారిటీ ఇచ్చారు. సినిమా చూసిన తర్వాత మీరు ఆ పాత్రల్లో లీనైపోతారని, వారి వయస్సులో ఇందులో కనిపించదని పేర్కొన్నారు. ‘అతరంగీ’ అంటే తెలుగులో అసాధారణమని అర్థం. కాబట్టి.. వీరి రిలేషన్స్ కూడా ఈ చిత్రంలో అసాధారణంగా ఉంటాయని చిత్రయూనిట్ తెలుపుతోంది. మరి, ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.
‘అతరంగీ రే’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి:
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి