YS Viveka Murder Case : వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపైనా ఆరోపణలు ! హత్య కేసులో సంచలన మలుపులు ఖాయమేనా ?
వివేకా హత్య కేసులో దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తర్వాత అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వివేకా కుమార్తె, అల్లుడితో పాటు సీబీఐపై ఆరోపణలు చేస్తూ వరుసగా కొంత మంది తెర పైకి వస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చిన్నాన్న, స్వయంగా మాజీ ఎంపీ, మాజ మంత్రి కూడా అయిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఎంతకీ తేలడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్ వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ సాధించుకున్నారు. అయితే సీబీఐ విచారణ కూడా నత్త నడకన సాగుతోంది. ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తుందన‌్న అంచనాల మధ్య కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది.కొంత మంది నేరుగా వైఎస్ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపైనే ఆరోపణలు చేస్తూ తెర ముందుకు వస్తూండటం ఆసక్తి రేపుతోంది. తాజాగా సీబీఐ అధికారులపైనా ఆరోపణలు ప్రారంభమయ్యాయి. దీంతో కేసు ఎలాంటి మలుపులు తిరగబోతోందన్న ఆసక్తి ప్రారంభమయింది.
వైఎస్ వివేకా హత్య.. విచారణ పరిణామ క్రమం ఇది !
2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులలోని ఆయన స్వగృహం దారుణంగా హత్య చేశారు. మొదట గుండెపోటుగా ప్రచారం చేశారు. రక్తపు మరకలు వంటి సాక్ష్యాలన్నీ తుడిచేశారు. పోస్టు మార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న వైఎస్ వివేకా కుమార్తె తాము వస్తున్నామని పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టారు. ఆమె వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. అప్పుడు వివేకా శరీరంపై పదునైన ఆయుధంతో నరికిన భారీ గాయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు మార్చారు. చివరికి హత్య కేసుగా మార్చారు. అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అప్పటి ప్రభుత్వం సిట్ వేసింది. కానీ దర్యాప్తు ముందుకు సాగలేదు. తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం సిట్ అధికారులను రెండు సార్లు మార్చింది. కానీ విచారణ ముందుకు సాగలేదు. దీంతో వైఎస్ సునీత హైకోర్టులో సీబీఐ విచారణ కోసం పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు నవంబర్ 11, 2020న సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే తర్వాత రెండు విడతలుగా సీబీఐ అధికారులు పులివెందుల వచ్చి విచారణ జరిపినా కేసు మిస్టరీ వీడలేదు. ఈ ఏడాది జూన్ ఆరో తేదీన మూడో సారి సీబీఐ టీం వచ్చింది. అప్పట్నుంచి విచారణ జరుపుతూనే ఉంది. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని అప్రూవర్‌గా అంగీకరింపచేశారు. కేసు ఇప్పుడు కీలక దశలో ఉంది.
వివేకా హత్య కేసులో మొదటి నుంచి ఎన్నో మలుపులు !
రాజకీయంగా కూడా వైఎస్ వివేకా హత్య కేసు సున్నితమైనది. అందుకే మొదట్లో టీడీపీ నేతలు చేయించారని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. స్వయంగా సీఎం జగన్ కూడా ఇదే మాట చెబుతూ ఉంటారు. ఇటీవల అసెంబ్లీలో కూడా " మా చిన్నాయనను ఎవరైనా ఏదైనా చేసి ఉంటే.. అది చంద్రబాబే చేయించి ఉంటారని " జగన్ ఆరోపించారు. అయితే సీబీఐ విచారణలో మాత్రం హంతకులుగా సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వంటి వారు వెలుగులోకి వచ్చారు. దస్తగిరి తన కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో అవినాష్ రెడ్డి పేరు కూడా చెప్పడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది.
Also Read : వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీట్ .. కాపీ కావాలని కోర్టులో సునీత పిటిషన్ !
వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు !
సీబీఐ అధికారులు ఎప్పుడైతే దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారో అప్పటి నుంచి కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తర్వాత ఆయన సీబీఐ డైరక్టర్‌కు నేరుగా ఓ లేఖ రాశారు. అందులో వివేకా కుమార్తె సునీత కుటుంబంపైనా దర్యాప్తు చేయాలని కోరారు. ఆమె శైలి అనుమానాస్పదంగా ఉందని..అలాగే ఆమె మీడియా సంస్థలతో టచ్‌లో ఉన్నారని..పదే పదే వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారులతో సమావేశమయ్యారని ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేశారని శంకర్ రెడ్డి లేఖలో ఆరోపించారు. హత్య కేసులో నిందితుడిగా అరెస్టయిన వ్యక్తి.. న్యాయం కోసం పోరాడుతూ.. సీబీఐ విచారణ సాధించుకున్న వైఎస్ సునీతపై ఆరోపణలు చేయడం సహజంగానే సంచలనం రేకెత్తించింది.
Also Read : వైఎస్ వివేకాను హత్య చేసింది వాళ్లిద్దరే ! సీబీఐ రిపోర్టులో కీలక అంశాలు ఇవే !
శంకర్ రెడ్డి తర్వాత భరత్ యాదవ్.. గంగాధర్ రెడ్డి !
వైఎస్ సునీత, ఆమె భర్తపై ఆరోపణలు చేస్తూ నేరుగా సీబీఐ డైరక్టర్ కు దేవిరెడ్డి శంకర్ రెడ్డి లేఖ రాశారు. తర్వాత భరత్ యాదవ్ అనే ఓ వ్యక్తి మీడియా సమావేశం పెట్టి ఇవే ఆరోపణలు చేశారు. వివేకా హత్య వెనుక ఉన్నది కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని భరత్ యాదవ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఆయన కూడా సీబీఐకి 0లేఖ రాశారు. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఆ తర్వాత తాజాగా అనంతపురం ఎస్పీని కలిసిన కల్లూరు గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డిలపైనే ఫిర్యాదు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డికి.. ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా సాక్ష్యాం చెప్పాలని బెదిరిస్తున్నారని అంటున్నారు.
Also Read : వైఎస్ వివేకా హంతకులెవరు?... ఆచూకీ చెబితే 5 లక్షలు నజరానా
కొత్తగా సీబీఐ దర్యాప్తు బృందంపైనా ఆరోపణలు !
ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డిలు వివేకా హత్య కేసు వెనుక ఉన్నారని చెబితే రూ. పది కోట్లు సీబీఐ అధికారులు ఇస్తామన్నారని సంచలన ఆరోపణలు చేశారని గంగాధర్ రెడ్డి. ఇవి సహజంగానే సీబీఐ అధికారుల్లోనూ కలకలం రేపుతాయి. ఈ ఫిర్యాదు అందిన వెంటనే అనంతపురం ఎస్పీ కూడా ఓ డీఎస్పీని విచారణకు నియమించారు. ఇప్పుడు ఈ డీఎస్పీ సీబీఐ అధికారులను విచారిస్తారా వారిపై కేసు పెడతారా అన్నది తదుపరి జరిగే పరిణామాలను బట్టి ఉంటాయని అంచనా వేయవచ్చు.
Also Read : మా ఇంటి చుట్టూ అనుమానితులు తిరుగుతున్నారు.. భయంగా ఉంది.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ
సీబీఐకి సవాలే..!
వివేకా హత్య కేసులో పరిణామాలు సీబీఐకి సవాల్‌గా మారాయి. సీబీఐ అధికారులు దర్యాప్తులో దూకుడు తగ్గించకపోతే వారిపైనా నిందలు వేస్తామన్న వ్యూహాన్ని నిందితులు అమలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారా అన్నది ఇప్పుడు స్పష్టం కావాల్సి ఉంది. తన తండ్రి హత్యకు కారకులైన వారికి శిక్ష పడాల్సిందేనని పోరాడుతున్న వివేకా కుమార్తె, అల్లుడిపైనే ఆరోపణలు వస్తున్నాయి. విచారణ జరుపుతున్న సీబీఐ పైనా ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి.. బ్లాక్ మెయిలింగ్, బురద చల్లడం ద్వారా ఎదుటి వ్యక్తిని ఆత్మరక్షణలో పడేసి తప్పించుకునే వ్యూహంలో నిందితులు ఉన్నారని అనుకోవచ్చు.. లేదా నిజంగానే వారు న్యాయం కోసం పోరాటం ప్రారంభించి ఉండవచ్చు. ఏదైనా కానీ సీబీఐ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆధారాలతో సహా మొత్తం బయటపెట్టాల్సి ఉంది. ఓ రకంగా ఈ కేసు సీబీఐకి సవాల్‌గా మారిందని చెప్పుకోవచ్చు.. !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి