Viveka Murder Case: మా ఇంటి చుట్టూ అనుమానితులు తిరుగుతున్నారు.. భయంగా ఉంది.. కడప ఎస్పీకి వివేకా కుమార్తె లేఖ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఓ వైపు సీబీఐ విచారణ సాగుతున్న సమయంలోనే.. వివేకా కుమార్తె.. కడప ఎస్పీకి లేఖ రాశారు.
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఓవైపు సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆయన కుమార్తె సునీతారెడ్డి తమ ప్రాణాలకు ముప్పు ఉందంటూ కడప జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ఎస్పీ లేకపోవడంతో లేఖను కార్యాలయ సిబ్బందికి అందించారు. ఆగస్టు 10వ తేదీ సాయంత్రం 5.10 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగాడన్నారు. అదే సమయంలో కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేశాడని సునీత లేఖలో వెల్లడించారు.
వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజుకు సంబంధించిన.. ఫ్లెక్సీలో ఉన్న మణికంఠరెడ్డి అనే వ్యక్తిలాగే ఉన్నాడని ఆమె లేఖలో తెలిపారు. ఈ విషయమై ఆగస్టు 12న సీఐ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని లేఖలో పేర్కొన్నారు. వివేకా హత్య జరిగిన తర్వాత 15 మంది అనుమానితుల పేర్లను అధికారులకు సునీతా అందించారు. అందులో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
వివేకా హత్య కేసులో 68 రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. కడప, పులివెందుల ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయిన అధికారులు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఉమా శంకర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
పులివెందుల క్యాంపు కార్యాలయంలో పనిచేసే రఘునాథ్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. కడపలో కూడా మరో నలుగురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. వివేకా కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు రాత్రి నుంచి విచారణ చేస్తున్నారు. కస్టడీలో ఉన్న సునీల్ యాదవ్‌పై విచారణ జరుగుతోంది. సాయంత్రం కొందరు అనుమానితులను సీబీఐ అధికారులు పులివెందులలో విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వివేకా పీఏ కృష్ణారెడ్డి, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్ రెడ్డి, చెప్పుల దుకాణం యజమాని మున్నాను నిన్న అధికారులు ప్రశ్నించారు. సురేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులు నిన్న విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించి వివేకా, సునీల్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశమైంది.
సునీల్ యాదవ్ కస్టడీలో ఇచ్చినటువంటి సమాచారం మేరకు అన్ని ప్రాంతాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం సీబీఐ అధికారులను కలిసి వెళ్లారు. కేసు దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు. పులివెందులలోని అనుమానితుల ఇళ్లలో నిన్న సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సునీల్ యాదవ్, దస్తగిరి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కత్తి, కొడవలి, పలుగు, పారను స్వాధీనం చేసుకున్నారు.