LB Nagar Murder Case: కేకే గార్డెన్ హత్య కేసులో 18 మంది అరెస్ట్... ఇనుప రాడ్లు, మద్యం సీసాలతో యువకుడి తలపై దాడి...
ఎల్బీ నగర్ కేకే గార్డెన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో యువకుడిపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్య కేసులో 18 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని కేకే గార్డెన్ లో జనవరి 1న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో 21 మంది ఉన్నారని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లు, మద్యం సీసాలతో యువకుడి తల, శరీరంపై కొట్టడంతో మృతిచెందాడని పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎల్బీ నగర్ పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చేపట్టామన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.
నిందితులపై గతంలోనూ కేసులు
నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఎల్బీనగర్ పోలీసులు తెలిపారు. వెల్లపుదాస్ మహేష్ గౌడ్, కార్తీక్, భార్గవ్ లు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. బాలం మాణిక్ రాజ్, మహేశ్వరం గణేష్, మెక్కొండ మనోజ్ పై గతంలో సరూర్‌నగర్, మీర్‌పేట్ పోలీసు స్టేషన్ లలో కేసులు ఉన్నాయని తెలిపారు. కేకే గార్డెన్స్ వెనుక బహిరంగ మైదానంలో మద్యం మత్తులో జరిగిన గొడవ నర్సింహ అనే యువకుడి హత్యకు దారి తీసింది. నిందితుల వద్ద నుంచి 2 కార్లు, మొబైల్ ఫోన్‌లతో పాటు వారికి సంబంధించిన బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...!
మద్యం మత్తులో గ్యాంగ్ వార్
హైదరాబాద్ ఎల్బీనగర్ లో శనివారం(జనవరి 1) అర్థరాత్రి ఇరువర్గాలకు చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. గంజాయి, మద్యం మత్తులో యువకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. రాడ్లు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో నరసింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నరసింహారెడ్డి మృతికి కారణమైన యువకుల నివాసంపై అతని బంధువులు దాడికి యత్నించారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్‌లో జనవరి అర్ధరాత్రి జరిగిన గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి ఎల్బీ నగర్ కేకే గార్డెన్స్ వద్ద ఖాళీ ప్రదేశంలో యువకులు మద్యం తాగుతున్నప్పుడు ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఇరువర్గాలు కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి