Covid Updates: జనవరి చివరికి గరిష్టానికి కోవిడ్ కేసులు... వచ్చే నాలుగు వారాలు చాలా కీలకం... డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన
తెలంగాణలో ఒమిక్రాన్ కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందని, జనవరి చివరికి కోవిడ్ కేసులు గరిష్టానికి చేరుకుంటాయని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. గత 5 రోజుల్లో 4 రేట్ల కేసులు పెరిగాయన్నారు.
తెలంగాణలో కోవిడ్ కేసులతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. జనవరి 1 నుంచి కరోనా కేసులు మరింతగా పెరిగాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గత ఐదు రోజుల్లో 4 రేట్ల కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... వచ్చే నాలుగు వారాలు చాలా కీలకమన్నారు. కరోనాతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో వచ్చే నాలుగు వారాలు అందరూ అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా కేసులు ఫిబ్రవరి నెలలో మళ్లీ తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు.
Also Read: నేడే ఏపీలో పీఆర్సీపై తుది నిర్ణయం? సీఎంతో భేటీ కానున్న ఉద్యోగ సంఘాలు
గత 5 రోజుల్లో 4 రేట్ల కేసులు
కరోనా కట్టడికి ప్రజలంతా నిబంధనలు తప్పకుండా పాటించాలని శ్రీనివాసరావు తెలిపారు. వైద్యారోగ్యశాఖ చేసిన సూచనలు పాటించాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని కోరారు. భౌతిక దూరం పాటించాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకోనివారు వెంటనే వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే సొంత వైద్యం చేసుకోకుండా చేసుకోకుండా వైద్యులను సంప్రదించాలని తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్ల కోవిడ్ పరీక్షలు చేసేందుకు కిట్లు, కోటికి పైగా హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ర్యాపిడ్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు కూడా చేస్తున్నామని వెల్లడించారు. కరోనా మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో జనవరి 1వ తేదీ నుంచి కేసులు భారీగా పెరిగాయని, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదయ్యాయని డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో గత 5 రోజుల్లో 4 రేట్లకు పైగా కేసులు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3శాతానికి పైగా ఉందని, కేసులు ఎక్కువగా నమోదవుతున్నా తీవ్ర ప్రభావం లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరిక తక్కువ సంఖ్యలో ఉందన్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వారు ఐదు రోజుల్లోనే కోలుకుంటున్నారని పేర్కొన్నారు.
Also Read: ఆర్జీవీ 10 ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని కౌంటర్.. ‘ఆ ఫార్ములా ఏంటి వర్మగారూ’ అంటూ వరుస ట్వీట్లు
జనవరి చివరికి పీక్స్
'డెల్టా కంటే ఆరు రేట్లు వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తుంది. కానీ ఒమిక్రాన్ వ్యాధి లక్షణాలు సాధారణంగానే ఉన్నాయి. కేవలం 5 రోజుల్లోనే బాధితులు కోలుకున్నారు. 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనబడటం లేదు. డెల్టా వేరింయట్ ఇంకా ఉంది. పూర్తిగా పోలేదు. కరోనా లక్షణాలు కనబడగానే పరీక్షలు చేయించుకోవాలి. కోవిడ్ అనగానే ఆస్పత్రికి భయంతో పరిగెడుతున్నారు. అనవసరంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయితే బెడ్స్ కొరత తలెత్తే ప్రమాదం ఉంది. ఆక్సిజన్ లెవల్స్ 93 కంటే తక్కువగా ఉంటేనే ఆస్పత్రిలో అడ్మిట్ కావాలి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి. ప్రైవేటు ఆస్పత్రిలో అనవసరంగా అడ్మిట్ చేసుకోవద్దు. వచ్చే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలి. జనవరి చివరి నాటికి కోవిడ్ పీక్ స్థాయికి చేరుకుంటుంది. ఫిబ్రవరి మధ్యలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 26 వేల బెడ్స్ సిద్ధంగా ఉంచాం. అనవసరంగా జనసామర్థ్యం ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళవద్దు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశాం. రాజకీయ పార్టీలు వచ్చే నాలుగు వారాలు కార్యక్రమాలు రద్దు చేసుకోవాలని సూచిస్తున్నాం. రాష్ట్రంలో 100 శాతం మొదటి డోస్ పూర్తి చేశాం. 71 శాతం రెండో డోస్ పూర్తి చేసుకున్నాం. జనవరి26 వరకు 100 శాతం సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒమిక్రాన్ వేరియంట్ కమ్యూనిటీ స్ప్రెడ్ జరిగింది. వచ్చిన కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి.' అని డీహెచ్ శ్రీనివాసరావు అన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి