Telugu Academy Scam: తెలుగు అకాడమీ స్కామ్ కేసులో రంగంలోకి ఈడీ.. సీసీఎస్ విచారణలో షాకింగ్ విషయాలు!
తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లను ముఠా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇలా కాజేసిన డబ్బులతో నిందితులు కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేశారు.
తెలుగు అకాడమీ నగదు కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.కోట్లాది డిపాజిట్ల మళ్లింపు కేసులో విచారణకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్లను ముఠా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇలా కాజేసిన డబ్బులతో నిందితులు కొన్ని స్థిరాస్తులను కొనుగోలు చేశారు. ఈ కేసును మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ దర్యాప్తు చేయనుంది.
Also Read: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాడు పని.. చైల్డ్ పోర్న్ వీడియోలతో రహస్య దందా.. పోలీసులు ఇలా కనిపెట్టేశారు
కాజేసిన డబ్బులు ఎలా వాడారంటే..
దాదాపు రూ.64.05 కోట్లు కాజేసిన నిందితులు వాటిని ఎలా వాడుకున్నారనే అంశాలను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ప్రధాన సూత్రధారి సాయికుమార్ రూ.20 కోట్లు తీసుకోగా... ఏపీ మర్కంటైల్ సహకార క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణరావు రూ.10 కోట్లు కమీషన్ తీసుకున్నాడని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఆ డబ్బులతో తాను 35 ఎకరాల భూమి కొన్నానని, అది వివాదాల్లో ఉందని సాయికుమార్ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ నుంచి తక్కువ ధరకే డీజిల్ ఇప్పిస్తానంటే ఓ డీలర్‌కు రూ.5 కోట్లు ఇచ్చానని, అతడు కనిపించకుండా పోయి మోసం చేశాడని చెప్పినట్లు తెలుస్తోంది.
మరికొందరు మాత్రం.. తాము కమీషన్లు తీసుకొని ఆ సొమ్ముతో ప్లాట్లు కొన్నామని, కొంత నగదు ఉందని వెనక్కి ఇచ్చేస్తామని యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్‌వలీ, కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన చెప్పినట్లు తెలిసింది. తాను సత్తుపల్లిలో ఓ అపార్ట్‌మెంట్ నిర్మిస్తున్నానని ఇందుకోసం డబ్బు వాడేశానని మరో నిందితుడు చెప్పినట్టు సమాచారం. కెనరా బ్యాంక్ మేనేజర్ సాధన భర్త బాబ్జీ సహా మరికొందరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్‌లు 3 రాష్ట్రాల్లో గాలిస్తున్నాయని జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్కామ్‌లో ఈడీ దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించింది.
Watch Video : స్పైస్ జెట్ ఎయిర్ హోస్టస్ విమానంలో డ్యాన్స్... నెట్టింట్లో వీడియో వైరల్