Chittoor News: నూటొక్క జిల్లాల మాయగాడు.. విగ్గుతో యువతులకు గాలం... అబ్బో ఇంకా చాలా సిత్రాలు ఉన్నాయ్
ఐఐటీలో చదివాడు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వెలగబెట్టాడు. బట్టతల దాచి విగ్గుతో మార్ఫింగ్ ఫొటోలు మ్యాట్రిమోనీ సైట్లలో పెట్టి పెళ్లికాని యువతులే లక్ష్యంగా మోసాలకు తెరతీశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
ఇటీవల వచ్చిన నూటొక్క జిల్లాల అందగాడు సినిమా హీరో తన బట్టతలను కవర్ చేసుకోడానికి విగ్గు పెట్టుకుని నానాఅవస్థలు పడుతుంటాడు. ఇలాంటిదే రియల్ గా జరిగింది. ఈ యువకుడు కేటుగాడు. మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా యువతులను మోసం చేస్తున్నాడు. ఉన్నత చదువులు చదివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశాడు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకుని రూ.లక్షలు కొట్టేశాడు. తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి, విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో యువతులకు వల వేసి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇదే కాకుండా గంజాయి స్మగ్లింగ్, నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టి ఉద్యోగాల పేరిట మోసాలు, ఇలా నేరాల చిట్టా పెద్దగానే ఉంది. పోలీసులకు చిక్కడంతో అతగాడి లీలలు బయటపడ్డాయి.
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులే లక్ష్యంగా
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో యువతులతో పరిచయం పెంచుకుని రూ.లక్షలు కొట్టేసిన కేటుగాడిని చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్, డీఎస్పీ సుధాకర్‌రెడ్డిలు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడి గ్రామానికి చెందిన పున్నాటి శ్రీనివాస్, అద్దంకిలో డిగ్రీ వరకు చదివి తర్వాత హైదరాబాద్‌లో ఎంసీఏ చేశాడు. తర్వాత ఐఐటీ కాన్పూర్‌లో ఎంటెక్ చేస్తూ మధ్యలో మానేశాడు. కొన్నాళ్లు సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేశాడు. 2017లో ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో తన ఫొటో పెట్టాడు. ఈ సైట్ ద్వారా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ యువతితో ఆన్‌లైన్ చాటింగ్ చేస్తూ, మళ్లీ ఇచ్చేస్తానని మాయమాటలు చెప్పి లక్షల్లో నగదు తీసుకున్నాడు. ఈజీగా డబ్బులు రావడంతో దీన్నే వృత్తిగా ఎంచుకున్నాడు.
Also Read: వాట్సాప్ ఎంత పని చేసింది.. జర చూస్కోవాలి కదా బ్రో.. స్టేటస్ తో బయటకొచ్చిన అసలు కథ!
విగ్గుతో ఫొటోలు.. లక్షల్లో వసూలు
పలు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో మార్ఫింగ్ విగ్గుతో ఉన్న ఫొటోలు పెట్టి యువతులకు గాలం వేసేవాడు. పేర్లు మార్చి వివాహం కాని యువతులతో చాటింగ్ చేసి, పరిచయం పెరిగాక మాయమాటలు చెప్పి డబ్బులు కావాలని తీసుకునే వాడు. 2017లో ఒంగోలుకు చెందిన ఓ యువతి వద్ద రూ.27 లక్షలు, 2018లో నరసరావుపేటకు చెందిన మరో యువతి వద్ద రూ.40 లక్షలు కొట్టేశాడు. ఈ కేసుల్లో రెండు సార్లు కటకటాలు లెక్కపెట్టాడు కూడా. అయినా శ్రీనివాస్‌లో ఏమాత్రం మార్పు రాలేదు. రెండు నెలల క్రితం చిత్తూరుకు చెందిన ఓ యువతితో మ్యాట్రిమోనీ సైట్ ద్వారా పరిచయం రూ.1.4 లక్షలు మోసం చేశాడు. మదనపల్లెలో మరో యువతి వద్ద రూ.7 లక్షలు కాజేశాడు. బాధిత యువతుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, చిత్తూరు–బెంగళూరు బైపాస్ రోడ్డులో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ శ్రీనివాస్ దొరికాడు. పోలీసుల విచారణలో శ్రీనివాస్ అసలు లీలలు బయటపడ్డాయి. నకిలీ సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేయడం, గంజాయి స్మగ్లింగ్, మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా యువతులను మోసం చేయడం ఇలా నేరాల చిట్టా పెద్దగానే బయటపడింది. నిందితుడి నుంచి రూ.50 వేల నగదు, ఓ విగ్గు, రెండు సెల్‌ఫోన్‌లను పోలీసు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ఫ్యామిలీనే చంపేసిన ముద్దుల కొడుకు, హోటల్ రూంలో ఫ్రెండుతో.. ఈ ‘గే’ కథ ఘోరం!