President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. కేంద్రీయ గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో భావోద్వేగ ప్రసంగం చేశారు.

Central Tribal University Convocation: భారతదేశ భవిష్యత్తును నిర్మించడంలో విద్యావంతులైన యువతదే అత్యంత కీలకమైన భూమిక అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో వైభవంగా జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలను, ప్రతిభ కనబరిచిన వారికి బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. ఒక మారుమూల గిరిజన గ్రామం నుంచి వచ్చి, ఆ గ్రామంలోనే మొదటి గ్రాడ్యుయేట్‌గా నిలిచిన తాను, నేడు ఇంతమంది గిరిజన, వెనుకబడిన వర్గాల యువతీయువకులకు ఉన్నత విద్యా పట్టాలను అందించడం అపరిమితమైన ఆనందాన్ని, భావోద్వేగాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
వెనుకబడిన వర్గాలను మరవద్దు.. సమాజానికి తిరిగిచ్చేయండి!
ఉన్నత విద్యావంతులుగా జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో సమాజంలో ఇంకా వెనుకబడి ఉన్న అట్టడుగు వర్గాలను ఎన్నటికీ మరవకూడదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు హితవు పలికారు. మీరు చదువుకుని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి.. కానీ అలా ముందుకు వెళ్లే క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అక్కడ అభివృద్ధి కోసం, కనీస అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎందరో పేదలు, అణగారిన వర్గాల వారు కనిపిస్తారు. వారిని చేయి పట్టి ప్రోత్సహించడంలో, వారికి సాధికారత కల్పించడంలో మీ వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చాలి అని ఆమె పిలుపునిచ్చారు.
అబ్దుల్ కలాం జీవితం ఆదర్శం..
భారతదేశాన్ని 2047 నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే వికసిత్ భారత్ జాతీయ దార్శనికతను సాధించడంలో నేటి యువత పాత్రే అత్యంత ప్రధానమైనదని రాష్ట్రపతి నొక్కి చెప్పారు. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా దేశ పురోగతికి ఉపయోగపడే ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. కటిక దారిద్ర్యం నుండి దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన మాజీ రాష్ట్రపతి, సైంటిస్ట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావుల జీవితాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. ఎంతటి కష్టాలు ఎదురైనా సంకల్ప బలంతో అనుకున్న లక్ష్యాలను ఎలా సాధించవచ్చో కలాం జీవితం మనకు నేర్పుతుందన్నారు.
ఆధునిక సాంకేతికతతో పాటు సంస్కృతిని కాపాడుకోవాలి!
గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం ద్వారా సమాజంలో సమాన అవకాశాలు లభిస్తాయని, సామాజిక పరివర్తన సాధ్యమవుతుందని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచం ఏఐ వంటి సరికొత్త సాంకేతిక యుగంలో దూసుకుపోతున్న తరుణంలో, యువత నూతన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూనే.. భారతదేశానికి ప్రతిష్ఠాత్మకమైన సాంస్కృతిక మూలాలను, గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్య అనేది కేవలం కెరీర్ నిర్మించుకోవడానికే కాదు, ఒక ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని, కరుణ కలిగిన మానవతా దృక్పథాన్ని అలవర్చుకోవడానికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు.
గవర్నర్, కేంద్ర మంత్రి సమక్షంలో ఘనంగా వేడుకలు
విశాఖ నోవాటెల్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ముతో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తమ చేతుల మీదుగా డిగ్రీలు అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు, వారిని తీర్చిదిద్దిన అధ్యాపక బృందానికి రాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















