తెలంగాణ ప్రభుత్వం నాంపల్లి నుంచి లక్డీకాపూల్‌ను అనుసంధానించే 1.45 కిలోమీటర్ల వై-షేప్ ఫ్లైఓవర్ ప్రాజెక్టును ఆమోదించింది. ఇది నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గిస్తుంది.
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు నాంపల్లి- లక్డీకాపూల్ మధ్య 1.45 కి.మీ వై-షేప్ ఫ్లైఓవర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ వన్‌వే బ్రిడ్జి ద్వారా సిగ్నల్ రహిత ప్రయాణం చేయవచ్చు.

- హైదరాబాద్ ట్రాఫిక్ తగ్గింపుకు వై-షేప్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు ఆమోదం పొందింది.
- నాంపల్లి-లక్డీకాపూల్ 1.45 కి.మీ. వన్-వే మార్గం రద్దీని తగ్గిస్తుంది.
- అసెంబ్లీ వెనుక రైలు స్థలాలపై నిర్మితమవుతూ భూసేకరణ వివాదాలు నివారిస్తుంది.
- సిగ్నల్ రహిత ప్రయాణం సమయం, ఇంధనం ఆదాచేసి ప్రయాణం సులభం.
Flyover Between Nampally and Lakdikapul | హైదరాబాద్: నగరంలో ట్రాఫిక్ రోజురోజుకూ మరింతగా పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం నాంపల్లి నుంచి లక్డీకాపూల్‌ను అనుసంధానించే 1.45 కిలోమీటర్ల వై-షేప్ (Y-shaped) ఫ్లైఓవర్ ప్రాజెక్టు నివేదికకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) నిర్మించనున్న ఈ మూడు లేన్లు, వన్-వే ఎలివేటెడ్ బ్రిడ్జి అసెంబ్లీ వెనుక భాగంలోని రైల్వే స్థలాల మీదుగా వెళ్తుంది. ఇది భూసేకరణ వివాదాలు లేకుండా నిర్మించనుండటంతో సిటీలో రద్దీ సమయాల్లో వాహనదారులకు సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందించి వారి సమయాన్ని సేవ్ చేస్తుంది.
పబ్లిక్ గార్డెన్స్ నుంచి లక్డీకాపూల్ వరకు..
ఈ ఫ్లైఓవర్ డిజైన్ ప్రకారం నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ సమీపంలో ప్రారంభమవుతుంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ దాటుకుంటూ అసెంబ్లీ వెనుక భాగంలో ఉన్న రైలు పట్టాలకు సమాంతరంగా ఈ లైన్ వెళ్తుంది. లక్డీకాపూల్ వద్దకు రాగానే ఇది వై-షేప్‌గా విడిపోతుంది. ఒక వైపు మాసబ్ ట్యాంక్ వైపు ఉన్న ప్రస్తుత ఫ్లై ఓవర్‌ను అనుసంధానించనుండగా, రెండో వైపు ఖైరతాబాద్ వైపు వెళ్లే రూట్ వస్తుంది. వన్-వే మార్గంలో సాగే ఈ ఫ్లైఓవర్ ద్వారా వాహనదారులు అత్యంత రద్దీగా ఉండే 3 జంక్షన్లను ఈజీగా దాటవచ్చు.
భూ సేకరణ టెన్షన్ అక్కర్లేదు
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే, ఈ మార్గంలో దాదాపు 99 శాతం నిర్మాణం ప్రభుత్వ, రైల్వే భూముల్లోనే జరుగుతుంది. అసెంబ్లీ బిల్డింగ్ వెనుక వైపు నుంచి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా ప్రైవేట్ ఆస్తుల సేకరణను హెచ్‌ఎమ్‌డీఏ (HMDA) పూర్తిగా నివారించింది. దీనివల్ల సుదీర్ఘమైన కోర్టు కేసులు, పరిహారం చెల్లింపుల్లో ఆలస్యం, భూసేకరణ వ్యయాలు తగ్గుతాయి. పనులు ప్రారంభమైన వెంటనే నిర్మాణం వేగంగా పూర్తయియితే నగరవాసులకు ట్రాఫిక్ సమస్య నుంచి త్వరలోనే ఉపశమనం లభిస్తుంది.
ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్ వివరాలు ఇవే..
మొత్తం మార్గం పొడవు : 1.450 కిలోమీటర్లు
లేన్ కాన్ఫిగరేషన్ : 3-లేన్, వన్-వే ఎలివేటెడ్ మార్గం
ప్రారంభ స్థానం: తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి
చివరి విభజన స్థానం : లక్డీకాపూల్ జంక్షన్ (వై-స్ప్లిట్)
నోడల్ ఏజెన్సీ : హెచ్‌ఎమ్‌డీఏ (HMDA)
రోడ్డు నెట్‌వర్క్ మెరుగుపడటంతో పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. రోజువారీ ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉండటంతో నాంపల్లి, లక్డీకాపూల్, మాసబ్ ట్యాంక్ వంటి ప్రాంతాల్లో ఇళ్లు, ప్లాట్లు కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది. ప్రధాన రైల్వే స్టేషన్, వాణిజ్య మార్కెట్లకు దగ్గరగా ఉండటం వల్ల నాంపల్లిలోని 2 BHK, 3 BHK ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే లక్డీకాపూల్‌లో అందుబాటులో ఉన్న ఫ్లాట్లు వ్యాపార కేంద్రాలకు వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా మారనున్నాయి. దీనివల్ల ఈ ప్రాంతాల్లో అద్దె ఆదాయం, ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉంది.
ఈ వై-షేప్ ఫ్లైఓవర్ హైదరాబాద్‌లో ప్రయాణ చిత్రపటాన్ని మార్చనుంది. రద్దీగా ఉండే రోడ్ల నుండి వాహనాలను పైకి మళ్లించడం ద్వారా, విఐపి కదలికలు, అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా HMDA సజావుగా ట్రాఫిక్ సాగేలా చూస్తుంది. దీనివల్ల వాహనదారులకు ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చుల భారం తగ్గనుంది.
Frequently Asked Questions
హైదరాబాద్‌లో ఏ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది?
ఈ ఫ్లైఓవర్‌ను ఎవరు నిర్మిస్తున్నారు? దీని ముఖ్య లక్షణాలు ఏమిటి?
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) దీనిని నిర్మిస్తోంది. ఇది మూడు లేన్లు, వన్-వే ఎలివేటెడ్ బ్రిడ్జి, ఇది రైల్వే స్థలాల మీదుగా నిర్మితమవుతుంది.
ఈ వై-షేప్ ఫ్లైఓవర్ వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి?
ఈ ఫ్లైఓవర్ వల్ల వాహనదారులకు సిగ్నల్ రహిత ప్రయాణం లభిస్తుంది, రద్దీ సమయాల్లో వారి సమయం ఆదా అవుతుంది. ప్రైవేట్ భూసేకరణ వివాదాలు లేకుండా ఇది నిర్మితమవుతుంది.
ఈ ఫ్లైఓవర్ ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ విడిపోతుంది?
ఈ ఫ్లైఓవర్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ సమీపంలో ప్రారంభమవుతుంది. లక్డీకాపూల్ వద్ద వై-షేప్‌గా విడిపోయి, ఒకవైపు మాసబ్ ట్యాంక్, మరోవైపు ఖైరతాబాద్ వైపు వెళ్తుంది.
ట్రెండింగ్ వార్తలు























