Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై 16 ఏళ్ల జాతీయ క్రీడాకారిణిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు పెట్టారు.

Telangana Basketball Association GS Prudhvishwar Reddy: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మాధాపూర్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. 16 ఏళ్ల జాతీయ స్థాయి మైనర్ మహిళా బాస్కెట్‌బాల్ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన తీవ్ర ఆరోపణల ఆధారంగా క్రైమ్ నంబర్ 1105/2026 కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 75(1)(iv) తో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (POCSO)లోని సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
బాధితురాలి కుటుంబ సభ్యులు బాస్కెట్‌బాల్ శిక్షణ , జాతీయ స్థాయి పోటీల ఎంపికల సమయంలో నిందితుడు ప్రుధ్వీశ్వర్ రెడ్డి సదరు మైనర్ క్రీడాకారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. జాతీయ స్థాయి పోటీల్లో ఆడాలంటే తన వ్యక్తిగత కోరికలను తీర్చాల్సిందే అని ఒత్తిడి తెస్తూ, అసభ్య సంజ్ఞలు చేయడం , శరీరంలోని ప్రైవేటు పార్టులను తాకుతూ తీవ్ర లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రతిభ ఉండి కూడా క్రీడా భవిష్యత్తు కోసం నిందితుడి ఆగడాలను భరించాల్సి రావడంపై బాధితురాలు తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది.
కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితుడు ఎల్‌బీ నగర్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే, ఈ కేసులో కొంతమంది ప్రభావవంతమైన రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందనే కారణంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని బాధితురాలి కుటుంబ సభ్యులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. నిందితుడు పోలీసుల కళ్లముందే స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం, స్థానిక పోలీసుల తీరుపై అనేక అనుమానాలకు దారితీస్తోందని విమర్శిస్తున్నారు.
తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై బాధితురాలి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "నా కుమార్తె జాతీయ స్థాయి క్రీడాకారిణి. ఆమె క్రీడా భవిష్యత్తు, చదువు, మానసిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నాయి. కేసు నమోదై రోజులు గడుస్తున్నా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు అని కన్నీటిపర్యంతమవుతున్నారు. కొందరు పోలీసులు నిందితుడికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆధారాలను దెబ్బతీసే యత్నం చేస్తున్నారని, స్థానిక పోలీసుల దర్యాప్తుపై తమకు కనీస నమ్మకం లేదని స్పష్టం చేశారు.
BREAKING ‼️
— Aapanna Hastham (@AapannaHastham) August 5, 2026
పోక్సో కేసులో మరో పింక్ లీడర్
కేటీఆర్ జిగ్రీ దోస్తు, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై పోక్సో కేసు
కామారావ్.. ఏందిది..
నిన్న నీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు,
ఇయ్యాల వీడు..
చిన్నపిల్లలని కూడా వదిలిపెట్టరా నీ లీడర్లు!!
ఏం నేర్పిస్తున్నవురా… pic.twitter.com/foE0zfHomb
కేసు నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని బాధితురాలి కుటుంబం పట్టుబడుతోంది. త్వరలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కలిసి కేసును ఎస్‌ఐటీకి బదిలీ చేయాలని కోరనున్నట్లు తెలిపారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి నుంచి బాధితురాలికి రక్షణ కల్పించాలని, సాక్ష్యాలను పరిరక్షించి నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మహిళా కమిషన్, బాలల హక్కుల పరిరక్షణ సంఘాలకు బాధితురాలి కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















