రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేయిస్తున్నాడు - కేటీఆర్ సంచలనం
ABP Southern Rising Summit 2024 లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై స్పందించారు కేటీఆర్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను కేటీఆర్ కొట్టిపారేశారు. సీఎం రేవంత్ రెడ్డే ఆ పని చేస్తున్నారని అన్నారు. 'తెలంగాణలో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం విపత్తు.. ఆయన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తుందా.? లేదా.? అని రేవంత్‌ని అడగాలనుకుంటున్నాను. బీఆర్ఎస్ హయాంలో అసలు ఎవరి ఫోన్లను ట్యాప్ చేయలేదు. మంత్రుల ఫోన్లను ట్యాప్ చేయించకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడే లైడిటెక్టర్ టెస్టుకు రావాలి.' అని కేటీఆర్ సవాల్ విసిరారు. బీజేపీ, ఎన్డీయే సారథ్యంలోని పాలక ప్రభుత్వంతో ఉన్న వారి వెంట ఈడీ పడదని.. ఎవరైనా వారితో లేకుంటే వారి వెంట పడుతుందని సెటైర్లు వేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాస్త వెనుకబడిందని.. అయితే ఇది పెద్ద నష్టమేమీ కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఇది 'కొత్త అభ్యాసం' అని పేర్కొన్నారు.