Expert Committee Formed on Sigachi Incident | సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ ఏర్పాటు | ABP Desam
సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచీ కెమికల్స్ లో జరిగిన ఘోర ప్రమాదం వెనుక కారణాలు తెలుసుకునే పనిని మొదలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ఓ నిపుణుల కమిటీనీ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సీఎస్ఐఆర్ సైంటిస్ట్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ సిగాచీ ప్రమాదానికి దారి తీసిన కారణాలపై అధ్యయనం చేయనుంది. ఫ్యాక్టరీస్ సేఫ్టీ రూల్స్ ను సిగాచీ పరిశ్రమ పాటించిందా..పాటిస్తే ప్రమాదం ఎలా జరిగింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే భవిష్యత్తులో ఏం చేయాలి లాంటి అంశాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. నెలరోజుల్లో కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని అధ్యయనం కోసం కమిటీకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. మరో వైపు సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 40 మంది మృతి చెందినట్లు సిగాచీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. 40 మంది ఉద్యోగులను కోల్పోవటం బాధాకరమన్న సిగాచీ సంస్థ..33 మంది గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సంస్థ ఒక్కో మృతుల కుటుంబానికి కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్యఖర్చులు తర్వాత పునారావసం కల్పించే బాధ్యతను తీసుకుంటామని సంస్థ తెలిపింది. రియాక్టర్లు పేలటం కారణంగా ప్రమాదం జరిగిందన్న దాంట్లో వాస్తవం లేదన్న సిగాచీ సంస్థ...పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తైన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ మేరకు సంస్థ కార్యకలాపాలు మూడు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు స్టాక్ ఎక్సేంఛ్ కు లేఖ రాసింది సిగాచీ సంస్థ.





















