Dr Sivaranjani Battle Againt Fake ORS Drinks | పోరాటాన్ని గెలిచి కన్నీళ్లు పెట్టుకున్న హైదరాబాదీ డాక్టర్ | ABP Desam
కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఎనిమిదేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆనంద భాష్పాలు కురిపిస్తున్న ఈమె పేరు డా. శివరంజని సంతోష్. పిల్లల వైద్యురాలిగా హైదరాబాద్ లో సేవలందించే శివరంజనీ సామాజిక కార్యకర్త. ఎనిమిదేళ్లుగా శివరంజని చేస్తున్న ఓ ఉద్యమం..ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె లక్ష్యం సాధించేలా చేసింది. ఇంతకీ ఆమె చేస్తున్న పోరాటం దేనిపైనో తెలుసా ORS.
Oral Rehydration Salts ORS అని సంక్షిప్తంగా పిలుచుకునే ఈ తెల్లటి పౌడరు 20 వ శతాబ్దంలో వైద్యశాస్త్రం కనిపెట్టిన అతిపెద్ద ఔషధం. డీహైడ్రేషన్ కారణంగా ఏర్పడే డయేరియాను కంట్రోల్ చేసి శరీరానికి కావాల్సిన లవణాలను అందించే ORS ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO నిబంధనలకు ఆధారంగా తయారు చేయాలి. అయితే ఇక్కడే మెడికల్ మాఫియా ORS పేరుతో వ్యాపారం చేస్తోందని డా.శివరంజినీ ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారు.
ORS పేరును విచ్చలవిడిగా వాడేసుకుంటూ మార్కెట్లోకి షుగర్ డ్రింక్స్ ను దింపేస్తున్నాయి చాలా కంపెనీలు. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఎన్నో ఇలా ORS పేరు కనిపించేలా లేబుళ్లు వేస్తూ డయేరియా తో బాధపడే పిల్లల తల్లితండ్రులు వచ్చినా ఇవే డ్రింక్స్ ను అంటగట్టేస్తున్నారు. ORS అనే అద్భుత ఔషధం వల్ల కలిగే లాభాలను ఈ డ్రింకులు అందించకపోగా...ఈ డ్రింక్స్ లో ఉండే హైలెవెల్ షుగర్స్ వల్ల పిల్లల మోషన్స్ ఇంకా పెరిగి వారి ప్రాణాలకే ప్రమాదం అని ఇన్నేళ్లూ పోరాడారు డా. శివరంజిని.
2022లో తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. మొదట కోర్టు ఆమెతోఏకీభవించింది. 2022 ఏప్రిల్‌లో ఫేక్ ఎనర్జీ డ్రింక్స్‌పై ORS ట్యాగ్ వేయడాన్ని FSSAI నిషేధించింది. కానీ, కొన్ని నెలలకే FSSAI వెనకడుగు వేసింది. ‘ఈ డ్రింక్ WHO ప్రమాణాలకు అనుగునమైన ORS కాదు’ అనే డిస్క్లెయిమర్‌తో ORS బ్రాండ్‌ను తిరిగి అనుమతించింది.
ఫార్మా జెయింట్స్ ఏదో ఒక రూపంలో తనను ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న శివరంజనీ పోరాటాన్ని మరింత తీవ్రం చేశారు. ఈసారి కేంద్ర ఆరోగ్యశాఖ, FSSAI, ORS బ్రాండ్ ఎనర్జీ డ్రింకులు తయారు చేస్తున్న సంస్థలను పార్టీలను చేస్తూ మరో PIL వేశారు. ఆమె ఫోరాటం ఫలించి అక్టోబర్ 14న FSSAI తుది ఉత్తర్వులు జారీ చేసింది.
ORS గా ఓ ద్రవాన్ని పిలవాలంటే అది WHO ప్రమాణాలను పాటించాలి. కానీ ORS పేరును నేరుగా వాడుతూనో..పేర్లలో చిన్న మార్పులతోనో..లేదా ఇది ORS కాదు అని డబ్బావెనుకనో రాసి ఇన్నాళ్లూ అమ్మేస్తున్న కంపెనీలు ఈ క్షణం నుంచి ఈ డ్రింకులను అమ్మకుండా Food Safety and Standards Authority of India - FSSAI ఆదేశాలు ఇచ్చింది. ORS కానివి ఏవీ ఆ పేరును వాడకూడదని FSSAI ఆదేశాలు జారీ చేయటంతో తన 8 ఏళ్ల పోరాటం ఫలించి ఇలా కన్నీళ్లు పెట్టేసుకున్నారు డా.శివరంజిని.
FSSAI ఆదేశాలున్నా ఇప్పటికీ మార్కెట్లో 180కోట్ల రూపాయలు విలువ చేసే ORS డ్రింక్స్ చెలామణిలో ఉన్నాయని వాటిని అమ్ముకోనివ్వాలని ఆయా కంపెనీలు ఉన్నత న్యాయస్థానాలు వెళ్తారని..అయితే పసి పిల్లల ప్రాణాలు ముఖ్యమో లేదా 180 కోట్లు ముఖ్యమో ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఆలోచించుకోవాలని కోరుతున్నారు డా. శివరంజిని.





















