Rohit Sharma T20 World Cup 2024 Final | వరల్డ్ కప్ లో ఫైనల్ రోహిత్ రెచ్చిపోవాలంటున్న ఫ్యాన్స్ | ABP
ప్రపంచకప్ తుదిసమరానికి మరికొద్ది గంటలే సమయం ఉంది. ఇలాంటి టైమ్ లో భారత అభిమానుల అందరి కోరికా ఒకటే. కెప్టెన్ గా హిట్ మ్యాన్ ఎలాగైనా టీమిండియాకు వరల్డ్ కప్ అందించాలని. 1983లో కపిల్ దేవ్ తొలి సారి భారత్ కు కెప్టెన్ గా వరల్డ్ కప్ ను అందిస్తే..2007లో 2011లో మహేంద్ర సింగ్ ధోని రెండు వరల్డ్ కప్ లను భారత్ కు అందించాడు. నాయకుడిగా అన్ని ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన మాహీ తర్వాత ఆ స్థాయిలో ఐసీసీ టోర్నీల నుంచి రిజల్ట్స్ రాబడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మనే. అంతెందుకు ఆఖరి రెండేళ్లలోనే భారత్ ఐసీసీ ట్రోఫీ ఫైనల్ ఆడటం ఇది మూడోసారి. 2023 లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడిన భారత్ ఆస్ట్రేలియాకు దాన్ని కోల్పోయింది. తిరిగి 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ తిరుగులేకుండా ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ మళ్లీ ఆస్ట్రేలియా చేతిలోనే ఓటమిపాలైంది. ఇప్పుడు ఇది రెండేళ్ల కాలంలో మూడో వరల్డ్ టోర్నీ ఫైనల్. 2024 టీ 20 వరల్డ్ కప్ లోనూ ఓటమి లేకుండా భారత్ ఫైనల్ కు దూసుకువచ్చింది. గత రెండు సార్లు కెప్టెన్ గా టీమిండియాను ఫైనల్ కు తీసుకువెళ్లిన రోహిత్ శర్మ..ఈసారి ఎలాగైనా కప్పు అందించాలనే కసితో ఉన్నాడు. ఇంగ్లండ్ తో సెమీస్ లో గెలిచిన తర్వాత చూశాం. రోహిత్ శర్మ ఎంత ఎమోషనల్ ఫీలయ్యాడో. దానికి రీజన్ అదే. ఇంకొక్క బ్లడీ ఇంచ్ దాటితే చాలు టీమిండియాను విశ్వవిజేతగా నిలిపిన ఘనత రోహిత్ శర్మ కెరీర్ లో మిగిలిపోతుంది. కెప్టెన్ గా తన సెల్ఫ్ లెస్ బ్యాటింగ్ తో కొన్నేళ్లుగా రోహిత్ ఎలా కీలకంగా మారాడో మనందరికీ తెలుసు. రికార్డులు పట్టించుకోకుండా వ్యక్తిగత మైల్ స్టోన్స్ గురించి ఆలోచించుకుండా హిట్ మ్యాన్ చేస్తున్న త్యాగాలకు సరైన గుర్తింపు రావాలంటే ఈ రోజు భారత్ చక్ దే ఇండియా అనాల్సిందే. విశ్వవిజేతలుగా నిలవాల్సిందే.