Odisha Puri Jagannath Temple Key | పూరి జగన్నాథుడి గుడికి రత్నభాండాగారం తాళాలు ఏమయ్యాయి?
ఒడిశాలో ఎన్నికల వేళ పూరి జగన్నాథుడి గుడికి సంబంధించిన రత్నభాండాగారం తాళాలు మాయం కావడంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. స్వయంగా మోదీ పూరికి వచ్చి దేవుడి తాళాలు పోయినా పట్టించుకోరా? అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీశాయి. ఐతే మోదీ, నవీన్ పట్నాయక్ రాజకీయం కాసేపు పక్కన పెడితే ఇంతకు ఆ పూరి రత్నభాండాగారంలో ఏముంది.? వజ్ర వైఢూర్యాలు ఉంటే మరి ఆ తాళం ఎవరు తీశారు.? తాళం పోయి 40 ఏళ్లు అవుతున్నా ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు.? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం..!
మన దేశంలో ఉత్తరాన బద్రీనాథ్, పశ్చిమాన ద్వారక, దక్షిణాన రామేశ్వరం, తూర్పున పూరి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపి చార్ ధామ్ అని పిలుస్తారు. హిందువులు తమ జీవితంలో వీటిని ఒక్కసారైన దర్శించుకోవాలని భావిస్తుంటారు. అలా చార్ ధామ్ లో ఒక ప్రముఖ పుణ్య క్షేత్రమే ఒడిశాలో ఉన్న పూరి. 12వ శతాబ్దంలోనే ఇక్కడ ఆలయ నిర్మాణం (Puri Jagannath Temple History) ప్రారంభమైంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. ఇది ఆలయ విశిష్ఠత ఐతే.. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్ధం నుంచి 18వ శతాబ్ధం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం వెండి వజ్ర వైఢూర్యాలు సమర్పించుకుంటూ వచ్చారు. అంతే కాదు..భక్తులు సైతం భారీ స్థాయిలో బంగారాన్ని దేవదేవుడికి కానుకలుగా ఇచ్చారు. ఇలా వచ్చిన విలువైన ఆభరణాలన్నీ శ్రీక్షేత్రంలోని రత్నభండాగారంలోని మూడో గదిలో దాచారు.