తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం
తిరుమలలో ఇంకోసారి చిరుత పులి కనిపించడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు వద్ద చిరుతపులి తిరిగింది. ఈ ద్రుశ్యాలు సీసీటీవీలో రికార్డు కూడా అయ్యాయి. ఆ చిరుత పులి ఓ కుక్కను తరుముతున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ వీడియోలు ఇప్పుడు బయటకు రావడంతో జనం మరింత ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో ఇలా జరిగినట్లుగా భావిస్తున్నారు. శ్రీనివాస మంగాపురం నుంచి శనివారం ఉదయం 5గంటలకు భక్తులను శ్రీవారి మెట్టుకు వదిలారు. అదే టైంలో సెక్యూరిటీ గార్డు తన రూం నుంచి బయటకు వచ్చి టీటీడీ సెక్యూరిటీ, అటవీశాఖ అధికారులకు చిరుత గురించి సమాచారం ఇచ్చాడు. తరువాత కాలినడక భక్తులను గుంపులు, గుంపులుగా వదులుతున్నారు. ఇక టీటీడీ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు చిరుత జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. గతేడాది తిరుమలలో చిరుత దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పట్లో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటి నుంచి ఆరు చిరుతలను బంధించారు.