Pawan Kalyan Warning: ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే తాటతీస్తా.. త్వరలో ఆ నలుగురు అరెస్ట్: పవన్ కళ్యాణ్
Pawan Kalyan about Red Sandalwood: ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని అటవీ పర్యావరణ శాఖ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలిపారు. తిరుపతిలో ఐదు జిల్లాల ఎస్పీలతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో శేషాచలం అడవుల నుంచి భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ గోదాముల్లో దొంగల నుంచి పట్టుబడిన 2.65 లక్షల ఎర్రచందనం దుంగలు ఉన్నాయని, దీని అర్థం సుమారు 1.30 లక్షల చందనం చెట్లు అడ్డగోలుగా నరికివేశారని చెప్పారు. ఈ పట్టుబడిన దుంగల విలువ సుమారు రూ. 2 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి @PawanKalyan పరిశీలించారు.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 8, 2025
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి… pic.twitter.com/yiPMWJ13oN
ఏపీ నుంచి వేల కోట్ల ఎర్రచందనం స్మగ్లింగ్..
అయితే, పట్టుబడకుండా స్మగ్లింగ్‌లో తరలిపోయిన ఎర్రచందనం ఇంకా చాలా ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక అంచనా ప్రకారం, ఆ ఐదేళ్ల కాలంలో రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 10 వేల కోట్ల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని తెలిపారు. మన రాష్ట్రం నుంచి తరలిపోయిన ఎర్రచందనం కర్ణాటకలో పట్టుబడగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వేలం వేసి రూ. 140 కోట్లు సొమ్ము చేసుకుందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇంత భారీ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతున్నా, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరూ దీనిపై బాధ్యత తీసుకోలేదని ఆయన విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఇప్పుడు పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై నియంత్రణ కోసం ఇతర రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తమ ఎర్రచందనం నేపాల్ వంటి ఇతర దేశాల్లో కూడా దొరుకుతోందని తెలిపారు. అన్ని రాష్ట్రాల మధ్య ఏపీకి ఒప్పందం ఉండాలని, ఎక్కడ దొరికినా ఆ ఎర్రచందనాన్ని తమ రాష్ట్రానికి అప్పగించేలా ఒప్పందం జరిగిందని ఆయన వివరించారు. ఉమ్మడి కడప జిల్లాలోని రెండు, మూడు జోనల్ ప్రాంతాల్లో స్మగ్లింగ్ విపరీతంగా జరుగుతోందని, ఈ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు కింగ్ పిన్‌లను గుర్తించామని, త్వరలో వారిని పట్టుకుంటామన్నారు.

స్మగ్లింగ్ జోలికి వెళ్లొద్దని పవన్ కళ్యాణ్ వార్నింగ్
"ఎవ్వరూ చందనం చెట్లు నరికే వృత్తిలోకి వెళ్లకండి. తమిళనాడు వాళ్లకు కూడా ఇదే చెబుతున్నాను. ఇదే నా వార్నింగ్. స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తాను" అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన 'ఆపరేషన్ కగర్' లాగా, ఇక్కడ మరో ఆపరేషన్ చేపడతామని తెలిపారు. ఎర్రచందనం జోలికి వెళితే తాట తీసి కూర్చోబెడతామని, మర్యాదగా వేరే పని చేసుకోమని ఆయన హితవు పలికారు.
ఎర్రచందనం చెట్లు కొట్టాలంటే భయపడే స్థితికి తీసుకువస్తామని, ఎందుకంటే ఒక చెట్టు కొడితే చరిత్రలో యుద్ధాలు జరిగాయని గుర్తుచేశారు. ఇతర రాష్ట్రాల్లోని ఓడరేవుల ద్వారా ఎర్రచందనం తరలిపోయే అంశంపై కూడా దృష్టి పెడుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.






















