Kuppam Chandrababu: కుప్పానికి పారిశ్రామిక కళ - ఐఫోన్ విడిభాగాల ఫ్యాక్టరీ సహా ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు
Chandrababu: కుప్పంలో చంద్రబాబు ఒకే రోజున ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. త్వరలో మరో ఎనిమిది పరిశ్రమలు వస్తాయన్నారు.

Kuppam seven industries foundation stone: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. శనివారం ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రూ.2,203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజలు, పలు సంస్థల ప్రతినిధులతో ఆన్‌లైన్‌లో మాట్లాడిన సీఎం, కుప్పంలో త్వరలో మరో 8 కంపెనీలు రూ.6,300 కోట్ల పెట్టుబడులతో స్థిరపడతాయని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్ మొత్తం స్థానికంగానే తయారు చేస్తామని, ఇక్కడి నుంచి పలు ప్రాంతాలకు సౌరవిద్యుత్ అందిస్తామని ప్రకటించారు.
హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E–Royce EV, ALEAP మహిళా పార్కులు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన వాటిల్లో ఉన్నాయి. ఈ సంస్థలకు ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది. కుప్పంలో డెయిరీ, పౌల్ట్రీ రంగాలు విస్తరించాల్సి ఉందన్నారు. గతంలో ఇక్కడే మైక్రో ఇరిగేషన్ ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. రైతుల పిల్లలు ఐటీ చదివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35% తెలుగువాళ్లే. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని ఆకాంక్షించారు.
ఈ పరిశ్రమల్లో హిందాల్కో ఐఫోన్ కాంపోనెంట్లను తయారు చేస్తుంది. కుప్పంలో ఉన్న పాత అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన Hindalco అక్కడ తన కార్యకలాపాలు మొదలుపెడుతుంది. 2026 చివరి నాటికి ఉత్పత్తికి అనుగుణంగా నిర్మాణం పూర్తవుతుందని.. 2027 నుంచి కార్యకలాపాలు మొదలవుతాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఈ ఫెసిలిటీ ద్వారా షుమారు 600 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. బెంగళూరులోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీకి కుప్పం సమీపంలో ఉంటుంది. ఈ అనుకూలతను ఉపయోగించుకుని కుప్పంలో Hindalco యూనిట్ ప్రారంభం అవుతోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఒక ప్రముఖ సంస్థ అయిన హిందాల్కో, అల్యూమినియం , రాగి ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది.
#HindalcoChoosesAP #ChooseSpeedChooseAP #AndhraPradesh is proud to welcome Hindalco, a global metals leader from the Aditya Birla Group, investing ₹586 crore in a state-of-the-art aluminium extrusion plant at Kuppam that will create 613 direct jobs and many more indirect jobs.… pic.twitter.com/buqjNjdgcl
— Lokesh Nara (@naralokesh) November 8, 2025
కుప్పంను విద్యా కేంద్రంగా మార్చుతామని సీఎం చెప్పారు. ఇప్పటికే యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలలకు ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి విదేశాలకు నాణ్యమైన పండ్లు ఎగుమతి చేస్తామని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని రైతులకు మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. ఏ వ్యాధి ఉన్నా ఇంటి వద్దే చికిత్స అందించేలా చర్యల తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్దేశించిన సమయానికి పరిశ్రమలు ప్రారంభించాలని పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు సూచించారు.
కుప్పంకు వస్తున్న పరిశ్రమల వల్ల రైతులు, యువతకు ఉద్యోగాలు, ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, "కుప్పం మా కుటుంబం. ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని వ్యాఖ్యానించారు.





















