Gouri Kishan : హీరోను అలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? - బాడీ షేమింగ్‌పై తమిళ హీరోయిన్ రియాక్షన్
Gouri Kishan Reaction : రీసెంట్‌గా ప్రెస్ మీట్‌లో తనకు జరిగిన చేదు అనుభవంపై తమిళ హీరోయిన్ గౌరీ కిషన్ రియాక్ట్ అయ్యారు. తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Tamil Actress Gouri Kishan Statement After Slamming Youtuber For Body Shaming : తమిళ మూవీ 'అదర్స్' ప్రమోషన్లలో భాగంగా రీసెంట్ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ గౌరీ కిషన్‌కు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. హీరోయిన్‌ను మీ వెయిట్ ఎంత? అని ఓ యూట్యూబ్ జర్నలిస్ట్ ప్రశ్నించడం వివాదాస్పదమైంది. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంశంపై ఆమె రియాక్ట్ అయ్యారు.
హీరోను ఇలానే అడుగుతారా?
ఈ వివాదంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ గౌరీ కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ప్రెస్ మీట్‌లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ... 'అది ఊహించని విధంగా ఉద్రిక్తంగా మారింది. ఆర్టిస్టులు, మీడియా మధ్య ఎలాంటి రిలేషన్ పెంపొందించుకోవాలనుకుంటున్నామో సమిష్టిగా ఆలోచించుకోవచ్చు. అయితే, విమర్శలు కూడా అందులో భాగమేనని నాకు అర్థమైంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఓ వ్యక్తిని బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదు.
సినిమా గురించి, వర్క్ గురించి ఏవైనా ప్రశ్నలు అడగొచ్చు. కానీ బాడీ షేమింగ్ క్వశ్చన్ అడిగారు. ఒక హీరోను అలానే అడుగుతారా?. క్లిష్ట పరిస్థితుల్లో నా స్థానాన్ని నిలబెట్టుకున్నందుకు నాకు గర్వంగా ఉంది. ఇది నాకు మాత్రమే కాదు. అది ఎదుర్కొన్న ఎవరికైనా ముఖ్యమైనది. చాలా మంది బాడీ షేమింగ్ చేస్తూ కామెడీగా తీసుకుంటున్నారు. అలా అనుకునే వారికి ఎవరికైనా మన అసౌకర్యం చెప్పడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. నేను ఒకటే స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ రిపీట్ కాకూడదు. అందరూ ఎప్పుడూ గౌరవంతో ఉండాలి. ఇండస్ట్రీలోనే కాకుండా బయట నుంచి కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు.
View this post on Instagram
Also Read : రాజీవ్‌కు యాక్సిడెంట్... ఆ కలలు నిజమయ్యాయి - డివోర్స్ ప్రచారంపై యాంకర్ సుమ స్ట్రాంగ్ రియాక్షన్
అసలేం జరిగిందంటే?
తమిళంలో వరుస సినిమాలతో అలరించిన గౌరీ కిషన్... తాజాగా అబిన్ హరికరణ్ దర్శకత్వంలో 'అదర్స్' సినిమాలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ప్రెస్ మీట్‌లో... హీరోయిన్‌ను ఓ యూట్యూబ్ జర్నలిస్ట్... 'మీ వెయిట్ ఎంత?' అని ప్రశ్నించాడు. దీనిపై ఆమె సదరు జర్నలిస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, గతంలో స్టార్ హీరోయిన్లు సైతం ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారంటూ తన క్వశ్చన్‌ను సమర్థించుకున్నాడు జర్నలిస్ట్.
దీనిపై గౌరీ ఘాటుగా స్పందించారు. 'నా బరువు తెలుసుకుని మీరు ఏం చేస్తారు? దాని వల్ల మీకు ఏంటి ఇబ్బంది? ప్రతి మహిళకు భిన్నమైన శరీరాకృతి ఉంటుంది. నా ప్రతిభ గురించి మాట్లాడండి. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాలు, రోల్స్ గురించి అడగండి చెబుతాను. అవే నేనేంటో నిరూపిస్తాయి. ఇలాంటి ప్రశ్నలు అడిగి మీ వృత్తిని అవమానించొద్దు.' అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కాగా... ఇండస్ట్రీ పెద్దలతో పాటు సింగర్ చిన్మయి ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు.





















