Congress Politics: బీజేపీ కుట్రలు కాంగ్రెస్ బయటపెట్టినా ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది: మహేష్ కుమార్ గౌడ్
బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, ఓట్ చోరీ పై రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారని.. కాంగ్రెస్ చేపట్టిన సంతకాల సేకరణకు 5 కోట్ల మందికిపైగా మద్దతు తెలిపారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

TPCC Chief Mahesh Kumar Goud | హైదరాబాద్: దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే విధంగా భారతీయ జనతా పార్టీ (BJP) అవకతవకలకు పాల్పడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. గాంధీ భవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పోరాటంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఇప్పటివరకు 5 కోట్ల మందికిపైగా ప్రజలు మద్దతు తెలిపారని వెల్లడించారు.
ఓటు చోరీని రాహుల్ సాక్ష్యాలతో బయటపెడుతున్నారు
లోక్‌సభతో పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన అవకతవకలను కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా నిరూపిస్తోందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటకలోని మహదేవ్‌పుర నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో జరిగిన భారీ తప్పిదాలు, బీజేపీ చేసిన మోసాలను రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయటపెట్టినా ఎన్నికల సంఘం (EC) ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ చేసిన కుట్రలను రాహుల్ గాంధీ స్పష్టమైన రుజువులతో నిరూపించారని ప్రస్తావించారు.
హర్యానాలో ఫేక్ ఓటర్లు.. బిహార్‌లో అదే సీన్
హర్యానాలో 25 లక్షలకుపైగా నకిలీ ఓటర్లు, 5 లక్షల డూప్లికేట్ ఓటర్లు, వందలాది తప్పుడు చిరునామాలు, వేలాది తప్పు ఫోటో వివరాలు ఉన్నాయని మహేష్ గౌడ్ వెల్లడించారు. ఒకే మహిళ ఫోటోతో 22 ఎంట్రీలు, 100 ఓటరు కార్డులు ఉన్నట్టుగా రాహుల్ గాంధీ నిర్ధారించారని ఆయన వివరించారు. ఇదే తరహాలో బీహార్‌లో కూడా బీజేపీ సహకారంతో "సర్" పేరుతో సంబంధం లేని ఓట్లను తొలగించిందని ఆయన విమర్శించారు. ఓటు చోరీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుత ఎన్నికల సంఘం బీజేపీ చెప్పుచేతుల్లో ఉందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
ఓటు చోరీపై ప్రజలు అర్థం చేసుకోవాలి..
ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాహుల్ గాంధీ బిహార్‌లో ప్రారంభించిన 'ఓటు అధికార్ ర్యాలీ' బీజేపీలో వణుకు పుట్టించిందని మహేష్ గౌడ్ అన్నారు. హర్యానాలో అనుసరించిన ఫార్ములాను ఉపయోగించి బీజేపీ ఇప్పుడు బీహార్‌లో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. గతంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పక్క జిల్లాల ఓటర్లను నమోదు చేసి, బీజేపీ సహకారంతో బీఆర్‌ఎస్ గెలిచిన ఉదాహరణను ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఓటు చోరీలను ప్రజలు అర్థం చేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. "ఇందిరా గాంధీ ఏనాడు అవకతవకలకు పాల్పడలేదు. ఓటు హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదు" అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, అల్లం భాస్కర్, హనుమంతు రావు, లింగం యాదవ్, గజ్జి భాస్కర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
నవీన్ యాదవ్‌ను గెలిపించండి.. భట్టి విక్రమార్క
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను పెద్ద మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత మన అందరి పైన ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నవీన్ యాదవ్ గెలుపు కోసం మీ ప్రార్థనా మందిరాలలో ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఈ క్యాబినెట్ మొత్తం కట్టుబడి ఉందన్నారు.
తెలంగాణ సమాజ హితం కోసం ప్రజా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని, ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. మొత్తం సమాజం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అరచేతుల్లో పెట్టి రక్షించుకోవాల్సిన కర్తవ్యం ప్రజలపై ఉందన్నారు. నవీన్ యాదవును గెలిపించి ఈ ప్రభుత్వాన్ని దీవించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఓటర్లపైనే ఉందన్నారు.






















