Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించారా? రెఫరెండం సవాల్‌పై కాంగ్రెస్ కౌంటర్ ఏంటీ?
Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రెఫరెండంగా భావించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుంటే, ప్రతి ఎన్నిక తమకు పరీక్షే అంటున్నారు రేవంత్. ఇంతకీ ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధం ఏంటో చూద్దాం.

Jubilee Hills by-elections: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ఆదివారంతో ముగియనుంది. దీంతో మూడు జాతీయ పార్టీలు ప్రతి ఒక్క ఓటర్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి ప్రతిపక్షాల విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కచ్చితంగా ప్రతి ఎన్నిక కూడా తమకు పరీక్షేనని చెప్పుకొచ్చారు. గెలిస్తే అందుకు సహకరించిన అంశాలు, ఓడిపోతే అందుకు కారణాలను విశ్లేషించుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు చేసే ప్రతి సవాల్‌ను స్వీకరించే తీరిక తమకు లేదని వివరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తాము గెలుస్తున్నామని బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాదని కుండబద్దలు కొట్టారు. దీనికి కౌంటర్‌గా ప్రతిపక్షాలు మాత్రం రేవంత్ రెడ్డి హ్యాండ్సప్ అనేశారని విమర్శలు చేస్తున్నారు.
బ్యాడ్ బ్రదర్స్‌తో సాగని పనులు: రేవంత్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మృతితో వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హీట్ పీక్స్‌కు చేరింది. రెండు రోజుల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు బస్తీ బాటపట్టాయి. ఇన్ని రోజులు గ్రౌండ్‌లో దిగి ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రెస్‌మీట్ పెట్టి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంటే వాటిని అడ్డుకోవడానికి కిషన్ రెడ్డి, కేటీఆర్ కష్టపడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో వారిద్దరు బ్యాడ్ బ్రదర్స్ అంటూ ధ్వజమెత్తారు. వారిద్దరు మూలంగా చాలా కార్యక్రమాలు ఆగిపోయాయని, చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసు, ఈ ఫార్ములా కేసు ముందుకు సాగడం లేదని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పని చేస్తున్నాయని నిత్యం తమ పనులకు కాలు అడ్డం పెట్టడమేవాళ్ల పని అన్నారు.
కేసీఆర్‌కు కిషన్ రెడ్డి గురుదక్షణ : రేవంత్
గతంలో కాంగ్రెస్ చేసిన పనలుు, రెండేళ్లుగా తాము చేసిన పనులు, పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ చేసిన పనులను బేరీజు వేసుకొని ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులను కేసీఆర్ మొదలు పెట్టారే తప్ప హైదరాబాద్‌కు కొత్తగా చేసిందేమీ లేదని అన్నారు. మెట్రో నిర్మాణ విషయంలో ఎల్‌అండ్ టీ వద్ద కమీషన్లు కొట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. దాన్ని పూర్తిగా నష్టాల్లోకి తీసుకెళ్లారని అన్నారు. ఇప్పుడు దాన్ని విస్తరించడానికి కేంద్రం మోకాలు అడ్డుతోందని విమర్శించారు. వారి ఊహించని విధంగా ప్రభుత్వమే మెట్రోను కొనుగోలు చేసే సరికి వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. తమ కమీషన్లు వచ్చే పనులు మాత్రం చేశారని వాటిపై విచారణకు ఆదేశిస్తే కేంద్రంలో కిషన్ రెడ్డి చక్రం తిప్పుతూ కేసులకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. తన విజయానికి కారణమైన కేసీఆర్‌కు కిషన్ రెడ్డి గురుదక్షణ చెల్లించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అందుకే బీఆర్‌ఎస్ విజయానికి కష్టపడుతున్నారని ఆరోపించారు.
ప్రతి ఎన్నిక పరీక్షే: రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నిక కూడా తమ పాలనకు పరీక్షగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. విజయం సాధిస్తే మరింత ఉత్సాహంతో ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచిస్తామని అన్నారు. ఓడిపోతే కచ్చితంగా జరిగిన తప్పులను సరి చేసుకొని ముందుకెళ్తామని అన్నారు. ఓడినా గెలిచినా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం లేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న సవాళ్లకు స్పందించి సమయాన్ని వృథా చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ వందకు వంద శాతం విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఓడిపోతే ఏం చేస్తారో ప్రతిపక్షాలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి లోపాయికారి ఒప్పందం తెలిసి కూడా బండి సంజయ్ లాంటి వాళ్లు కష్టపడుతున్నారని వారిని చూస్తే జాలి వేస్తోందని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి హ్యాండ్సప్: కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను రెఫరెండంగా తీసుకునేందుకు వెనుకాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యాండ్సప్ చేశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. తమ రెండేళ్ల పాలన చూసి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని సవాల్ చేశారు. అంతే కాని గతాన్ని గుర్తు చేసి అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
రెండేళ్లలో చేసిందేేంటీ
రెండేళ్లలో చేసింది ఏం లేదు కాబట్టే రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరించి ఓట్లు అడుగుతున్నారని అన్నారు. తనకు సంబంధం లేదని కాంగ్రెస్ పాలన గురించి ప్రస్తావిస్తున్నారంటే వారి ఓటమి ఖాయమైందని గ్రహించారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా మోసం చేసిన వ్యక్తికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు. గెలిస్తే అభివృద్ధి చేస్తామని గతంలో కంటోన్మెంట్‌లో చెప్పి విజయం సాధించారని ఇప్పుడు అక్కడ ఏం చేశారో వివరించాలని డిమాండ్ చేశారు. ఎవరి హయాంలో హైదరాబాద్‌కు రోడ్లు, ఫ్రైఓవర్‌లు, ఓవర్ బ్రిడ్జ్‌లు సహా వివిధ అంతర్జాతీయ సంస్థలు వచ్చాయో ప్రజలకు బాగా తెలుసని తెలిపారు. హైడ్రా గురించి గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి దాని కారణంగానే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల జోలికి వెళ్లని హైడ్రా కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తోందని వారిని రోడ్డు పడేస్తోందని మండిపడ్డారు.





















