Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తనిఖీల కలకలం- కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు చేయడంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Jubilee Hills by-election : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పుడు పోలీసులు చేస్తున్న తనిఖీలు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతల ఇంట్లో చేపట్టిన తనిఖీలు పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి. ఇది రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి చేస్తున్న కుట్రగా బీఆర్‌ఎస్ ఆరోపిస్తుంటే, ఇలాంటివి చేయడం కేసీఆర్, కేటీఆర్‌కే చెల్లుతుందని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మొత్తానికి పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ క్షణానికో అంశం తెరపైకి వస్తున్న తరుణంలో ఉపఎన్నికపై అందరీ ఫోకస్ పడుతోంది.
ఈ తెల్లవారుజాము నుంచి బీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో పోలీసులు తనిఖీలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రావు ఇంట్లో సోదాలు చేశారు. ఉపఎన్నిక పరిధిలోని రాని తమ ఇళ్లల్లో తనిఖీలు చేయడంపై నేతలు మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులతో ఉపఎన్నికల్లో పోటీ లేకుండా చేయాలని బూత్‌లలో ప్రత్యర్థులు రాకుండా కట్టడి చేసేందుకు దౌర్జన్యాలకు రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారని గులాబీ నేతలు ఆరోపించారు. గట్టిగా మాట్లాడేవారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించడమంటే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమేనని నేతలు ఆరోపించారు. పోటీ లేకుండా ఉంటే రిగ్గింగు చేసుకోవచ్చని అధికారపార్టీ భావిస్తోందని విమర్శించారు. ఇలాంటివి కచ్చితంగా జరగకుండా అడ్డుకుంటామని ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తరపున పోరాడుతూనే ఉంటామన్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. పోలీసులే డబ్బులు పెట్టి తమను ఇరికించే కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. తాము అప్రమత్తంగా ఉండటంతో సైలెంట్‌గా వెళ్లిపోయారని అన్నారు.
మోతీనగర్‌లో తన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని వెళ్తున్న టైంలో తనను అడ్డుకోవడాన్ని మర్రి జనార్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన ఇంటికి రానివ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తరఫున పోలీసులు రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువుర ఇళ్లల్లో సుదీర్ఘంగా సోదాలు చేసిన పోలీసులు ఎలాంటి వివరాలు చెప్పకుండానే వెళ్లిపోయారు. పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. ఎవరి ఇంట్లో కూడా ఎలాంటి నగదు లభ్యం కాలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు తమ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారన తెలుసుకున్న బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడకు తరలి వచ్చారు. వారిని కంట్రోల్ చేసే క్రమంలో కాసేపు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానిది కక్ష సాధింపులు చేసే ప్రభుత్వం కాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్‌ఎస్ టైంలో కనీసం ప్రత్యర్థులను ఇంటి నుంచి కూడా బయటకు రానిచ్చేవాళ్లు కాదని సమాధానం చెప్పారు. అలాంటి కుట్ర, కక్ష సాధింపు రాజకీయాలు కేసీఆర్, కేటీఆర్‌కే తెలుసన్నారు. కాంగ్రెస్ హాయంలో ఏం చేసిన చట్టం పరిధిలోనే ఉంటుందని తప్పు చేసిన వాళ్లు కచ్చితంగా దోషులుగా నిలబడతారని వార్నింగ్ ిచ్చారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉందని కాబట్టే ప్రతిపక్షాలు స్వేచ్ఛా ప్రచారం చేసుకుంటున్నాయని గుర్తు చేశారు.





















