Nizamabad: రియాజ్‌ది ఎన్‌కౌంటర్ కాదు లాకప్‌డెత్- నిజామాబాద్ జిల్లా పోలీసులపై సంచలన ఆరోపణలు
Nizamabad: నిజామాబాద్‌లో జరిగిన రియాజ్ ఎన్‌కౌంటర్ ఫేక్ అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయన్ని పోలీసులు కొట్టి చంపేశారని అంటున్నారు. సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు.

Nizamabad: తెలంగాణలో సంచలనం సృష్టించిన రియాజ్ ఎన్‌కౌంటర్ కేసు మరో మలుపు తిరిగింది. ఇది కచ్చితంగా ఫేక్ ఎన్‌కౌంటర్ అని రియాజ్ ఫ్యామిలీ ఆరోపిస్తోంది. ఆయన్ని కాల్చేసి తర్వాత ఎన్‌కౌంటర్‌గా కట్టుకథలు అల్లుతున్నారని విమర్శిస్తున్నారు. ప్రమోద్‌ను కూడా హత్య చేసింది రియాజ్ కాదని అనుమానం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. కానిస్టేబుల్ ప్రమోద్‌ను నిజంగా హత్య చేసిన వాడిని అరెస్ట్ చేసి.. ప్రమోద్ కుటుంబానికి న్యాయం చేయాలని అంటున్నారు. రియాజ్ కుటుంబంపై ఇప్పటికి వేధింపులు జరుగుతున్నాయని... ఆ కుటుంబంలోని చిన్న పిల్లలను రోడ్ల మీద వేధిస్తున్నారని... దీనిపై వాళ్ళకు న్యాయం జరగాలి అభ్యర్థిస్తున్నారు.
మొత్తం కేసులో ఆసిఫ్ పాత్ర ఉందని రియాజ్ కుటుంబ సభ్యులు అనుమాన పడుతున్నారు. అతనిపై లోతుగా విచారణ చేయాలన్నారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌లో భాగమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులకు తాము వ్యతిరేకం కాదని ఈ ఎన్‌కౌంటర్‌ను కొందరు పోలీసులు కుట్రపూరితంగా చేశారని మండిపడుతున్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వానికి అభ్యర్థించామని వారు వినకపోయే సరికి జాతీయ స్థాయిలో పోరాడుతున్నామని అన్నారు.
Firecrackers were burst over my son’s corpse, celebrations were held. We were mourning our son while people were celebrating. A child is a child whether my son or anyone else’s son, blood is blood. If something wrong has been done to my son, then he must certainly receive… pic.twitter.com/edu7T77xSi
— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) November 8, 2025
మీడియాతో మాట్లాడిన సందర్భంగా రియాజ్ తల్లి భావోద్వేగానికి గురయ్యారు. "నా కొడుకు మెడ విరిచేశారు. పొట్టలో నుంచి పేగులు బయటకు వచ్చాయి. దారుణంగా చంపేశారు. నా కొడుకు నిజంగా హంతకుడు అయితే ఆ ఆధారాలు చూపించండి. నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఏ తల్లికైన కొడుకు కొడుకేగా.. నా కొడుకుకు జరిగినట్లు ఎవరికి జరగకూడదు. నా కొడుకు చనిపోయినప్పుడు, అంతిమ యాత్రలో తీసుకెళ్తుంటే పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నా కొడుకు అంతిమ యాత్రలో పోలీసులు వచ్చి ఎక్కడా ఆగనివ్వకుండా పంపించేశారు. శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తుంటే, ఇక్కడ చేయకూడదు అని వెళ్లగొట్టారు. ఎవరి కొడుకుకైనా ఇలాంటి పరిస్థితి రాకూడదు." అని కంటతడి పెట్టుకున్నారు.
రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనపై సోషల్ యాక్టివిస్ట్ మాట్లాడుతూ... రియాజ్ ఒక పోలీస్ అధికారిని నిజంగా చంపితే అతను నిజామాబాద్‌లో ఉంటాడా.. వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పారిపోడా? పోలీసులు తన కుటుంబాన్ని హింసిస్తున్నారని రియాజ్ తానే స్వయంగా లొంగిపోయాడు. లొంగిపోయిన తరువాత పోలీసులు అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, చిత్రహింసలు పెట్టారు. అతను కస్టడీలోనే చనిపోయాడు. రియాజ్ చనిపోయాక అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి, 407 ఖైదీల రూంలో పెట్టారు, 4వ ఫ్లోర్‌లో ఉన్న రోగులు అందరిని ఖాళీ చేయించారు. చేతులు కట్టేసి ఉంటాయి.. రియాజ్ మెడ విరిగిపోయింది, శరీరం మీద తీవ్ర గాయాలు ఉన్నాయి. అలాంటి మనిషి పోలీసులను ఎదిరించి గన్ లాక్కుంటాడా?. అలా చెప్పి, పోలీసుల ఉన్నతాధికారుల సమక్షంలో మృతదేహానికి మూడు బుల్లెట్లను కాల్చారు. రియాజ్ కస్టడీలో బతికే ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు నడుచుకుంటునో, వీల్ చైర్‌లోనో తీసుకెళ్తారు కదా.. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించడం లేదు. మృతదేహం చూశాక అతని మెడ ఊగిపోతోంది, ముక్కు విరిగిపోయింది, పెదాలు పగిలిపోయాయి. దీనిపై సీబీఐ ఎంక్వేరీ వేసి నిజానిజాలు బయటకు చెప్పాలి. అని అన్నారు.






















