Minister KTR: రజనీకాంత్ మరణానికి బాధ్యత నాదే... శాసనమండలిలో మంత్రి కేటీఆర్ ప్రకటన... బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటన
హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు నాలాలో పడి రజనీకాంత్ అనే యువకుడు చనిపోయాడు. ఈ ఘటనపై తనదే బాధ్యత అని మంత్రి కేటీఆర్ అన్నారు. రజనీకాంత్ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందిస్తామన్నారు.
హైదరాబాద్ నగరంలోని మణికొండ నాలాలో ప్రమాదవశాత్తు పడి రజనీకాంత్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చనిపోయారు. ఈ ఘటనకు గుత్తేదారు సహా పురపాలక శాఖ బాధ్యత ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రిగా రజనీకాంత్ మృతికి బాధ్యత వహిస్తామని కేటీఆర్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇద్దరు ఉన్నతాధికారులను సస్పెండ్ చేశామని మంత్రి తెలిపారు. శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. శాసనమండలి సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అధిక వర్షాలకు న్యూయార్క్ లాంటి మహా నగరాలే ఇబ్బందులకు గురవుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నాలాల విస్తరణకు ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు చేపడుతున్నట్లు ప్రకటించారు.
Also Read: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి
మరో రూ.5 లక్షల పరిహారం
రోడ్ల విస్తరణలో గుత్తేదారులకు బిల్లులు చెల్లించట్లేదనే ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రజనీకాంత్ మృతికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించింది. పరిహారం రూ.10 లక్షలకు పెంచాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మరో రూ.5 లక్షలను రజనీకాంత్ కుటుంబానికి అందిజేస్తామని కేటీఆర్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం మణికొండలోని ఓ డ్రైనేజీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రజనీకాంత్ ప్రమాదవశాత్తు పడిపోయారు.
Also Read: మణికొండలో డ్రైనేజీలో పడి గల్లంతైన యువకుడు... 48 గంటల తర్వాత మృతదేహం లభ్యం...
అసలు జరిగిందేంటి..
హైదరాబాద్ లో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు గత శనివారం రాత్రి డ్రైనేజీ గుంతలో పడి రజినీకాంత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అతని మృతదేహం డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్ చెరువులో మృతదేహం లభ్యమైంది. మూడు కిలోమీటర్ల దూరంలో రజనీకాంత్ మృతదేహం కొట్టుకొచ్చిన్నట్లు అధికారులు తెలిపారు. గోపిశెట్టి రజినీకాంత్ షాద్ నగర్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. గత శనివారం రాత్రి 9 గంటలకు పెరుగు ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రజినీకాంత్ నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడిపోయారు. మూడు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది రజనీకాంత్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైనేజీ వెళ్లే మార్గంలో గాలించారు.
ఈ ప్రమాద దృశ్యాలు ఓ వ్యక్తి వర్షం వీడియో తీస్తుండగా అందులో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు, మణికొండ మున్సిపల్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో డ్రైనేజీ పొడవునా గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం గాలించారు. డ్రైనేజీ కలిసే నెక్నాంపూర్ చెరువులో మృతదేహం లభ్యమైంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండానే పైపులైన్ పనులు చేపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి