Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Telangana : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ స్థానంలో మరో సీనియర్ ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Deepa das Munshi: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ఆ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న దీపాదాస్ మున్షీని తొలగించే అవకాశాలు ఉన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఇంచార్జ్‌గా మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు థాక్రే ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత ఆయననుతప్పించారు. బెంగాల్ కు చెందిన దీపాదాస్ మున్షీని నియమించారు.
Also Read: నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
సాధారణంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ కాబట్టి ఆమె పార్టీ వ్యవహారాలకే పరిమితం కావాలి. కానీ పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. అదే సమయంలో మంత్రి వర్గ విస్తరణ జరగకపోవడానికి కూడా ఆమె అడ్డం పడటమే కారణమన్న అసంతృప్తి కొంత మంది నేతల్లో ఉంది. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అంటే.. హైకమాండ్‌కు నివేదికలు పంపడం కీలకం. వారు పంపే నివేదికల్ని హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పార్టీ పరిస్థితులపై నివేదికలు ఇస్తూ మంత్రి వర్గ విస్తరణ జరగకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దీపాదాస్ మున్షి రాష్ట్రంలోకి వచ్చిన కొత్తలో అత్యంత లగ్జరీ కారును గిఫ్టుగా పొందారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే వారిపై ఆమె కోర్టులో కేసు వేశారు. ఇంచార్జ్‌కు అసలు తెలంగాణలో ఏం పని అని వస్తున్న విమర్శలను కూడా ఆమె లెక్క చేయడం లేదు. దీపాదాస్ మున్షి పై కాంగ్రెస్‌లోనే అంతర్గతంగా అసంతృప్తి కనిపిస్తూండటంతో హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపుతున్నారని ప్రచారం జరుగుతోంది.పార్టీ హైకమాండ్ కు కూడా ఇలాంటి ఫీడ్ బ్యాక్ వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.