KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
KTR Comments On Formula E-Race: హైదరాబాద్ రీజినల్ రింగ్‌రోడ్డులో భారీ అవినీతి జరగబోతోందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయని మండిపడ్డారు.
KTR Comments On Formula E-Race And Hyderabad Regional Ring Road :కొత్త సంవత్సరం రోజున తెలంగాణ ప్రభుత్వంపై ఈ ఫార్ములా రేస్ కేసుపై మాజీ మంత్రి,బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాగైనా తనను అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే ఆరో ప్రయత్నంగా పస లేని ఈ ఫార్ములా రేసు కేసు తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. పైసా అవినీతి జరగని చోట కేసును ఎలా పెట్టారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏసీబీ పెట్టిన ఎఫ్‌ఐఆర్ తప్పు అని కొట్టిపారేశారు. ఈ కేసు విషయంలో కోర్టులో జరుగుతన్న వాదన సందర్భంగా న్యాయమూర్తి అడిన ప్రశ్నలకు ఏజీ సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. అందుకే ఇదో లొట్టపీసు కేసుగా అభివర్ణించారు. ఈ కేసులో తనను అరెస్టు చేసినట్టైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాలన్నారు కేటీఆర్.
ఈడీ విచారణకు ఈనెల 7న వెళ్లడంపై తన న్యాయనిపుణుల బృందం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు కేటీఆర్. న్యాయస్థానాలపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. మరోవైపు కొత్తగా టెండర్లు పిలవబోతున్న ట్రిపుల్ ఆర్ విషయంలో చాలా అవినీతి జరగబోతోందని ఆరోపించారు కేటీఆర్. దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరగబోతోందని అన్నారు. తెలంగాణలో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి మూటలు పంపిస్తున్నారని కామెంట్స్ చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెనక్కి తగ్గేదే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుపై సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు వెల్లడించారు. కచ్చితంగా వారిపై వేటు పడుతుందన్న కేటీఆర్... ఈ ఏడాదిలోనే ఉప ఎన్నికలు కూడా ఉంటాయని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో ఆయన బాగా తెలుసని ప్రజలకు అవసరమైనప్పుడు కచ్చితంగా బయటకు వస్తారని వివరించారు.