నల్గొండ టూ టౌన్ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది: ఎస్పీ రంగనాథ్
దళిత యువకుడిని నల్గొండ టూ టౌన్ పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి కాలు విరగొట్టారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎస్పీ రంగనాథ్ స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.
భూ వివాదంలో నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. జోక్యం చేసుకున్నాడని, దళిత యువకుడి పై విచక్షణా రహితంగా దాడి చేశారని వస్తున్న ఆరోపణలపై ఎస్పీ రంగనాథ్ స్పందించారు. సమగ్ర విచారణ కోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించినట్టు చెప్పారు. విచారణలో పోలీస్ అధికారులు తప్పు చేసినట్లుగా నిర్ధారణ అయితే వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తి నల్లగొండ పట్టణంలో లేని భూమిని కాగితాలపై ఉన్నట్లుగా చూపించి విక్రయించడని, ఆ భూమిలో ఇల్లు నిర్మాణం చేసి ఉన్నదని బాధిత వ్యక్తులు 6 జులై 2021 రోజున టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారని ఎస్పీ తెలిపారు. దీంతో రొయ్య శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
చీటింగ్ కేసుకు సంబంధించి గత నెల 10వ తేదీన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి నోటిషులు ఇచ్చినట్టు వెల్లడించారు. లేని భూమిని విక్రయం చేసిన వ్యవహారంలో శ్రీనివాస్ 35% కమిషన్ తీసుకున్నట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని స్పష్టం చేశారు. శ్రీనివాస్ తో పాటు అతడిపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి సమగ్రంగా అన్ని వివరాలు సేకరిస్తామన్నారు. పోలీసుల తప్పు ఉన్నట్లుగా నిర్ధారణ జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో నల్లగొండది కాదు
ఎవరో ఒక వ్యక్తిని కాళ్లు కట్టేసి కొడుతున్నట్లుగా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వీడియో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ది కాదని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తిని కొడుతున్నట్లుగా అసత్య ప్రచారం సాగుతుందన్నారు. ఆ వీడియో నల్లగొండ జిల్లాకు సబందించినది కాదని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. తప్పుడు ప్రచారాలు, వైరల్ అవుతున్న వీడియోను ప్రజలు నమ్మవద్దని జిల్లా ప్రజలను కోరారు.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
Also Read: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి
Also Read: Hyderabad: భార్యకు జాకెట్ కుట్టిచ్చిన భర్త.. తర్వాత లోనికి వెళ్లి ఉరేసుకున్న భార్య.. ఏం జరిగిందంటే..