Bibipeta Govt School: తాను చదువుకున్న పాఠశాల చాలా ఇచ్చింది.. అందుకే కోట్లతో రూపురేఖలు మార్చి తిరిగేచ్చేశారు సుభాష్ రెడ్డి
రూ. వెయ్యి ఇవ్వాలంటే వందసార్లు ఆలోచిస్తారు. ఆయన మాత్రం ఏకంగా రూ.6 కోట్లతో స్కూల్ కట్టించారు. చదువుకున్న స్కూల్ కి ఏదైనా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వ స్కూల్ రూపురేఖలే మారిపోయాయ్.
ఓ సినిమాలో తాను పుట్టిన ఊరు కోసం ఏమైనా చేయాలనుకున్న మహేష్ బాబు ఆ ఊరు రూపురేఖలే మార్చేస్తాడు. శ్రీమంతుడు సినిమాలో ఇలా జరుగుతుంది. అందులో కథానాయుకుడు.. ఊరి బాగు కోసం ఎంతో చేస్తాడు. నిజజీవితంలోనూ అలాంటి ఓ హీరో ఉన్నాడు. అతనే కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి. తిమ్మయ్య గారి సుశీల-నారాయణ రెడ్డి దంపతుల కొడుకు సుభాష్ రెడ్డి. బీబీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి చదువుకున్నారు. 1986 పదోతరగతి బ్యాచ్.
రెండేళ్ల క్రితం స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వర్షం పడితే పిల్లలు స్కూల్ మానేసేవారు. కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితి. అయితే ఆ స్కూల్ లో చదివిన చాలా మంది సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. అందులో సుభాష్ రెడ్డి ఒకరు. 1986 పదోతరగతి బ్యాచ్ లో సుభాష్ రెడ్డి సహా ఆయన స్నేహితులు స్కూల్ కి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తలా కొంత చందాలు వేసి స్కూల్ బాగు చేయాలని ఆలోచించారు. అయితే సుభాష్ రెడ్డి మాత్రం ఫ్రెండ్స్ సహాయం తీసుకోకుండా ఒక్కడే స్కూల్ మొత్తం బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే ఆ స్కూల్ రూపు రేఖలే మారిపోయాయ్. ఒకప్పుడు కనీస వసతులు లేని స్కూల్.. ప్రస్తుతం అన్ని హంగులతో ముస్తాబైంది.
సుభాష్ రెడ్డికి చదువుకున్న స్కూల్ మీద మమకారం ఎంతో ఉంది. అలా తాను చదివిన ప్రభుత్వ స్కూల్ కి 6 కోట్ల రూపాయలు స్వంత డబ్బు వెచ్చించి స్కూల్ రూపు రేఖలు మార్చేశారు. 2020లో కరోనా సమయంలో జనవరిలో స్కూల్ కట్టడం మొదలు పెట్టి కేవలం 11 నెలల్లోనే బడిని కట్టించడం పూర్తి చేశారు. సుభాష్ రెడ్డి తన తల్లిదండ్రుల పేరు తిమ్మయ్యగారి సుశీల-నారాయణ రెడ్డి పేరు మీద స్కూల్ కట్టించారు.
ఈ పాఠశాలలో ప్రతి ఒక్క వసతిని కల్పించారు సుభాష్ రెడ్డి.
బీబీపేట స్కూల్ 1950లో మొదలైంది. 1929 వరకు ఊర్దూ మీడియం స్కూల్ గా ఉండేది. ఆ తర్వాత తెలుగు మీడియం.. 2008లో తెలుగు, ఇంగ్లీష్ మీడియాలలో బోధన చేస్తున్నారు. ప్రస్తుతం స్కూల్ కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా.. సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సోషల్ ల్యాబ్.. అలాగే స్పోర్ట్స్ కి సంబంధించిన అన్ని పరికరాలు ఏర్పాటు చేయించారు సుభాష్ రెడ్డి. రెండెకరాల స్థలంలో 32 గదులు, పిల్లలు కూర్చుని తినేందుకు డైనింగ్ హాల్, కిచెన్ షేడ్, విద్యార్థులు స్వచ్ఛ మైన తాగు నీరు కోసం ఆర్వో ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేయించారు. డిజిటల్ రూంలో ప్రొజెక్టర్ ను సైతం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం డబ్బు సాయం కూడా చేస్తారు సుభాష్ రెడ్డి. స్కూల్ పరిస్థితిని చూసి కేవలం 11 నెలల్లోనే స్కూల్ కట్టించారని బడిలో అన్ని ఏర్పాట్లు చేయించారని స్కూల్ ప్రిన్సిపల్ కే.వై, పద్మిని చెబుతున్నారు.
స్కూల్ లో మొత్తం 651 మంది విద్యార్థులు చదువుకుంటారు. వారందరికీ అవసరమయ్యే స్కూల్ యూనిఫామ్, టై, బెల్ట్ సైతం సుభాష్ రెడ్డినే సొంత డబ్బులతో ఇచ్చారు. స్కూల్ భవనంపైన ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేకంగా అన్ని హంగులతో కూడిన 4 రెస్ట్ రూంలను సైతం ఏర్పాటు చేయించారు సుభాష్ రెడ్డి. చుట్టు అందమైన ప్రకృతి నడుమ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ ను చూసేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చి వెళ్తుంటారు. పాఠశాలలో పిల్లలు కూర్చునే టేబుల్స్ ఒక్కో టేబుల్ 8 వేల రూపాయలు పెట్టి కొన్నారు. లగ్జరీ చైర్స్.
ఏబీపీ బృందం.. స్కూల్ కి వెళ్లిన సందర్భంలో స్కూల్ ను చూసేందుకు హైదరాబాద్ నుంచి నల్లమల్లారెడ్డి ఇన్సిట్యూషన్స్ అధినేత నిషాంత్ రెడ్డి, రూరల్ వాటర్ సప్లై రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా వచ్చారు. పాఠశాలను చూసి వారు ఆశ్చర్యపోయారు. ఏబీపీ దేశంతో తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
స్కూల్ ఇంత అందంగా తీర్చిదిద్దిన సుభాష్ రెడ్డికి రుణపడి ఉంటామంటున్నారు విద్యార్థులు. ఆధునిక హంగులతో సకల సౌకర్యాలు కల్పించారని.. ఎక్కడా లేని విధంగా తమ స్కూల్ లో అన్ని ల్యాబ్ లు ఏర్పాటు చేయించారని.. కంప్యూటర్ ల్యాబ్ ను సైతం తమకు అందుబాటులో ఉంచి కార్పొరేట్ స్థాయిలో తమకు విద్య అందించేలా చేసిన సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థులు.
స్కూల్ కే కాదు తన సొంత ఊరైన జంగంపల్లి గ్రామంలో ప్రభుత్వం.. పేదలకు ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు సైతం కోటి రూపాయలు సుభాష్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. మరోవైపు ఈ స్థాయిలో కట్టించిన స్కూల్ మెయింటెన్స్ కోసం పూర్వవిద్యార్థుల కార్పస్ ఫండ్ కింద 2 కోట్ల రూపాయలు జమ చేశారు. ఆ డబ్బును స్కూల్ మెయింటెనెన్స్ కోసం వాడుతున్నారు. ఆ స్కూల్ కు ఉన్న చరిత్ర అది. అందులో చదువుకున్న వారు చాలా మంది ప్రస్తుతం మంచి స్థానాల్లో ఉన్నారు. అందుకే దాతలు ఇలా మందుకొచ్చారు. ప్రస్తుతం ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలంగాణలోనే ఆదర్శంగా నిలుస్తోంది.
Also Read: MLA Vanama Son : పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు...
Also Read: Surya Namaskar: 75 కోట్ల సూర్య నమస్కారాల చాలెంజ్ .. ! ఇందులో ఇలా మీరు కూడా భాగం అవ్వండి