KTR: ‘అమిత్ షా అభివన సర్దార్’ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు: కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
Kishan Reddy: వేడుకల్లో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అభినవ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గా అభివర్ణించారు.
హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ విమోచన దిన వేడుకల సందర్భంగా హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా జి.కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటైన కౌంటర్ ను మంత్రి కేటీఆర్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. వేడుకల్లో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అభినవ సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ గా అభివర్ణించారు. 74 ఏళ్ల క్రితం ఒక హోంమంత్రి భారత ప్రజలను ఐక్యం చేసి, తెలంగాణను భారత్‌లో కలిపేందుకు వచ్చారని, ఇవాళ హోం మంత్రి అమిత్ షా రాష్ట్రంలో విమోచన దినోత్సవం జరుపుతున్నారని అన్నారు.
దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కౌంటర్ గా ట్వీట్ చేశారు. అప్పట్లో తొలి హోం మినిస్టర్ జనాల్ని ఏకం చేశారని, ఇప్పటి హోం మినిస్టర్
(అమిత్ షాను ఉద్దేశించి..) వచ్చి ప్రజలను విభజించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశానికి నిర్ణయాత్మకమైన రాజకీయాలు కావాలని, అంతేకానీ.. విభజన రాజకీయాలు వద్దని కేటీఆర్ ట్వీట్ చేశారు.
‘‘74 ఏళ్ల క్రితం ఒక హోం మంత్రి తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఇండియన్ యూనియన్ లో కలిపేందుకు వచ్చారు. ఇప్పుడు ఒక కేంద్ర మంత్రి తెలంగాణ ప్రజలను, ప్రభుత్వాన్ని విడగొట్టడానికి వచ్చారు. అందుకే నేను చెప్తాను.. దేశానికి నిర్ణయాత్మక విధానాలు కావాలి. విభజన రాజకీయాలు కాదు’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
74 years ago, A Union Home Minister came to UNITE & INTEGRATE The People of
— KTR (@KTRTRS) September 17, 2022
Telangana into Indian union
Today A Union Home Minister has come to DIVIDE & BULLY
The People of Telangana & their state Govt
That's why I say, India needs
DECISIVE POLICIES Not
DIVISIVE POLITICS
పరేడ్ గ్రౌండ్ లో కిషన్ రెడ్డి ప్రసంగం
పరేడ్ గ్రౌండ్ లో జరిగిన విమోచన వేడుకల్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ స్టేట్‌లో తొలిసారి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఎగవేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వాత ఇప్పుడు అదే జాతీయ పతాకాన్ని ఎగరవేశామని అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభినవ సర్దార్ పటేల్ అని కిషన్ రెడ్డి అభివర్ణించారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్‌లో శనివారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకల్లో కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
బీజేపీ పోరాటం ఫలితంగానే ఇప్పుడు విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోంది. సెప్టెంబరు 17 నిజాం నియంత పాలనకు చరమగీతం పాడిన రోజు. స్వాతంత్య్రం వచ్చాక త్రివర్ణ పతాకం ఎగరేస్తుంటే నిజాం ఒప్పుకోలేదు. పాకిస్థాన్‌లో హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేసేందుకు సిద్ధపడ్డాడు. చివరికి ఎందరో ప్రాణాలు అర్పించారు. సెప్టెంబరు 17న తెలంగాణలో గత ప్రభుత్వాలు విమోచన వేడుకలు జరపలేదు.
మళ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవతో జరుపుకుంటున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా నిజాం పాలిత ప్రాంతాల్లో విమోచన వేడుకలు జరుపుకుంటున్నాయి. అలాంటిది తెలంగాణ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా వేడుకలు నిర్వహిస్తోంది. అసలు ఇన్నిరోజులు విమోచన వేడుకలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు.’’ అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.