HBD Venkatesh: హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వెంకీమామ మన అందరివాడు, ఈ ప్రత్యేకతలు ఆయనకే సొంతం
Venkatesh Birthday: తెలుగు సినిమా పరిశ్రమలో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్టరీ వెంకటేష్. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా స్టార్ హీరోగా ఎదిన వెంకీ.. 63వ ఏట అడుగు పెట్టారు.
Happy Birthday Victory Venkatesh: విక్టరీ వెంకటేష్.. సినిమా బ్యాంగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అగ్ర కథానాయకుడిగా ఎదిగారు. విజయాలనే ఇంటిపేరుగా మార్చుకుని విక్టరీ వెంకటేష్ అయ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందరు హీరోల అభిమానులు అభిమానించే నటుడు వెంకీ మామ. అదే వెంకటేష్ ప్రత్యేకత. ఆయన నేటితో 62 ఏళ్లు పూర్తి చేసుకుని 63వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.
నిర్మాత కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయం అయినా..
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ 1960, డిసెంబర్ 13 న ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. చెన్నైలో డిగ్రీ పూర్తి చేశారు. అమెరికాలోని మోంటెరే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి MBA పట్టా తీసుకున్నారు. వెంకటేష్ నీరజను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. వెంకీ తండ్రి దిగవంగత దగ్గుబాటి రామానాయుడు ప్రముఖ నిర్మాతగా కొనసాగారు. అత్యధిక సినిమాలు నిర్మించి మూవీ మొఘల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాత కొడుకుగా సినిమా పరిశ్రమకు పరిచయం అయినా, చక్కటి నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే ఒదిగిపోయి నటించడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే ఆయను అందరు హీరోల అభిమానులూ ఇష్టపడతారు.
బాల నటుడి నుంచి అగ్ర హీరో దాకా..
బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్, 1986లో ‘కలియుగ పాండవులు’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించారు. తొలి సినిమాతోనే అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో నటనకు గాను నూతన కథా నాయకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన వెనుదిగిరి చూసుకోలేదు.
ఆ తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’, ‘స్వర్ణకమలం’, ‘వారసుడొచ్చాడు’ ‘ప్రేమ’, ‘బొబ్బిలిరాజా’, ‘కూలీ నెం.1’, ‘క్షణ క్షణం’, ‘చంటి’, ‘సుందరకాండ’, ‘అబ్బాయిగారు’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ‘పవిత్రబంధం’ వంటి సినిమాలతో నటుడిగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు.
‘సూర్యవంశం’, ‘గణేష్’, ‘ప్రేమించుకుందాం రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘రాజా’, ‘కలిసుందాం రా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘ఘర్షణ’, ‘మల్లీశ్వరి’, ‘సంక్రాంతి’, ‘లక్ష్మీ’, ‘తులసి’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘దృశ్యం’, ‘గోపాల గోపాల’, ‘గురు’, ‘ఎఫ్ 2’, ‘వెంకీ మామ’, ‘ఎఫ్ 3’,’నారప్ప’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.
లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఒకటేమిటీ అన్ని వైవిధ్య చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. ‘కలియుగ పాండవులు ‘ సహా ‘ప్రేమ’, ‘ధర్మచక్రం’, ‘చంటి’, ‘స్వర్ణకమలం’, ‘గణేష్’, ‘కలిసుందాం రా’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ సినిమాల్లో అద్భుత నటనకు గాను నంది అవార్డులను దక్కించుకున్నారు.
వెంకీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్లు
అంతేకాదు, తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన ఎంతో మంది ముద్దుగుమ్మలను వెంకీ తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఫరా, టబు, దివ్య భారతి, గౌతమి, ప్రేమ, ఆర్తీ అగర్వాల్, ప్రీతి జింతా, కత్రినా కైఫ్, అంజలా జవేరి లాంటి స్టార్ హీరోయిన్స్ అంతా వెంకీ సినిమాలతోనే తెరంగేట్రం చేశారు. వెంకటేష్ సినిమాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కుటుంబం అంతా కలిసి చూసేలా ఉంటాయి. వెంకీ సినిమాల్లో సీరియస్ యాక్షన్‌తో పాటు కామెడీ అలరిస్తుంది.
వివాదరహితుడు విక్టరీ వెంకటేష్
చిత్ర పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి వెంకటేష్. తన సినిమాల గురించి తప్ప వ్యక్తిగత విషయాలను బయటకు రాకుండా చూసుకుంటారు. ఇక ఆయన ఆస్తుల విలువ సుమారు రూ. 2 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. రామానాయుడు స్టూడియోలో వాటాతో కలిపి మరింత ఎక్కువే ఉండవచ్చని టాక్.
Read Also: 73వ వసంతంతోకి రజనీకాంత్, తలైవా గురించి 9 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం!