Viral News: ఉమ్ము మీద పడింది అని అడిగినందుకు దారుణం, నడిరోడ్డుపై రెచ్చిపోయిన రౌడీ షీటర్లు
Warangal News | చేసింది తప్పు అని తెలిసినా కొందరు దారుణంగా ప్రవర్తిస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే వరంగల్ లో జరిగింది. ఓ అమాయకుడ్ని పట్టుకుని ఇద్దరు రౌడీ షీటర్లు విచక్షణారహితంగా కొట్టారు.
Rowdy Sheeters attacks one man in Warangal | వరంగల్ : వరంగల్‌లో దారుణం జరిగింది. చిన్న విషయానికి గొడవ జరిగి, అది పెద్దదై వివాదంగా మారడంతో ఓ అమాయకుడ్ని చితకబాదారు. ఇద్దరు రౌడీ షీటర్లు కలిసి ఓ వ్యక్తిని కర్రతో, తమ వద్ద ఉన్న మరో ఆయుధంతో దారుణంగా దాడిచేసి రక్తం వచ్చేలా కొట్టారు. వరంగల్ లోని బీఆర్ నగర్ లో ఇద్దరు రౌడి షీటర్లు ఓ వ్యక్తి ని తీవ్రంగా చితకబాదారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. శుక్రవారం నాడు బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుండి వీడియో తీయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
వరంగల్ నగరంలోని ఎస్ఆర్ఆర్ తోటకు చెందిన సంతోష్ అనే వ్యక్తి తన పొలం పనులు ముగించుకొని బీఆర్ నగర్ మీదుగా ఎస్ఆర్ఆర్ తోటలోని ఇంటికి వెళుతున్నాడు. బిఆర్ నగర్ వద్ద ఒక జంక్షన్లో ఆటోలో కూర్చున్న రౌడీషీటర్ మల్లికార్జున్, సమోసా సంపత్ లు ఇద్దరు నిర్లక్ష్యంగా బయటకు ఉమ్మడంతో సంతోష్ అనే వ్యక్తిపై పడింది. తన మీద ఎందుకు ఉమ్మారంటూ బాధితుడు సంతోష్ ప్రశ్నించాడు. దీంతో రౌడీషీటర్లకు, సంతో ష్ కు మధ్య మాట మాట పెరిగింది. మల్లికార్జున్ అనే రౌడీషీటర్, సమోసా సంపత్ లు సంతోష్ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టారు. రోడ్డు మీద పడేసి పిడిగుద్దులు గుద్దారు. ఆటోలో ఉన్న ఓ వస్తువును తీసుకువచ్చి, దానితోటి దాడి చేశారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న కర్రను తీసుకుని చొక్కా పక్కకు జరిపి మరి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. దీంతో సంతోష్ అనే వ్యక్తి శుక్రవారం మిల్స్ కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇద్దరి కోసం గాలిస్తున్నారు. గొడవకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: కొడుకు ప్రేమ పెళ్లితో తల్లిని చిత్రహింసలు! 10 మంది మహిళలపై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్