Vizianagaram Kidnap: వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్, గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు
విజయనగరం జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్ శుక్రవారం కలకలం రేపింది. జిల్లాలోని తెర్లాం మండలం కూనయివలస గ్రామానికి చెందిన టి.ఈశ్వరరావు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఈశ్వరరావును దుండగులు కిడ్నాప్ చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే దుండగులను పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎస్.కోట దగ్గర కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
50 లక్షలు డిమాండ్
కిడ్నాప్ కు గురైన యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కరోనా దృష్ట్యా తన స్వగ్రామం తెర్లాం మండలం కూనయివలసలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడంతో డబ్బులు ఉంటాయని అతనికి తెలిసిన శృంగవరపు కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ కు యత్నించాడు. నలుగురు వ్యక్తులకు సుఫారీ అందించి కిడ్నాప్ చేయమని పురమాయించాడు. దీంతో మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువకుడ్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు. అనంతరం ఆ వ్యక్తి పై దాడి చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కిడ్నాప్ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.
తీవ్రగాయాల పాలైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్
ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై దుండగులు దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. అతడిని ధర్మవరం గ్రామంలో కిడ్నాపర్లు వదిలివెళ్లారు. గ్రామస్థుల సాయంతో అతడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో బాధితుడి సమాచారాన్ని తెర్లాం పోలీసులు అందించామని స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడ కిడ్నాప్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. పూర్తి విచారణ చేపడతామన్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారా.. మరొక కారణం ఉందా అనేది దర్యాప్తు తెలుస్తుందన్నారు.
Also Read: వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్